మరో కొత్త ట్విస్ట్ : వంశీపై మరో కేసు.. సత్యవర్థన్ కూడా నిందితుడే?
టీడీపీ మహిళా నేత రమాదేవి ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ ను ఏ5 నిందితుడిగా పేర్కొంటూ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.;
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఈ నెల 11వ తేదీనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినా విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు కిడ్నాప్ కేసు బాధితుడు సత్యవర్థన్ ని కూడా నిందితుడిగా చేర్చడం గమనార్హం. టీడీపీ మహిళా నేత రమాదేవి ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ ను ఏ5 నిందితుడిగా పేర్కొంటూ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. 84/2025 ఎఫ్ఐఆర్ ప్రకారం వంశీ, సత్యవర్థన్ తోపాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు.
వైసీపీ నేత వల్లభనేని విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారంటూ వంశీతోపాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేసిన ముదుసూరి సత్యవర్థన్ ను కులుం పేరుతో దూషించారని కేసు నమోదైంది.
ఈ కేసులతో తనకు సంబంధం లేదని సత్యవర్థన్ ఇటీవల కోర్టులో వాంగ్మూలమిచ్చారు. అయితే సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి ఆయనపై బలవంతంగా కేసు వాపసు తీసుకునేలా ఒత్తిడి చేశారని సత్యవర్థన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే వంశీ అండ్ బ్యాచ్ అరెస్టు కాగా, సత్యవర్థన్ తో మేజిస్ట్రేట్ కు మరో వాంగ్మూలం ఇప్పించారు.
ఈ కేసు ఇలా ఉండగానే సత్యవర్థన్ ను కూడా నిందితుడిగా చేర్చుతూ పోలీసులు మరో కేసు నమోదుచేయడం తాజాగా బయటకు వచ్చింది. టీడీపీ గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళా నేత మేడేపల్లి రమ ఫిర్యాదు మేరకు ఏ1గా వంశీ, ఏ5గా సత్యవర్థన్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వంశీ అనుచరులు కొమ్మా కోట్లు, భీమవరపు రామక్రిష్ణ, రాజు ఇతర నిందితులు.
వల్లభనేని వంశీ బెదిరింపులుతోపాటు ఆయన నుంచి రూ.5 లక్షలు తీసుకుని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సత్యవర్థన్ ఉపసంహరించుకున్నట్లు రమాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు వాపసు తీసుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని వంశీతోపాటు ఆయన అనుచరులు చెబుతున్నారని, టీడీపీ నేతలతో మాట్లాడి అంతకంటే ఎక్కువ మొత్తం వచ్చేలా తనకు సహాయం చేయాలని సత్యవర్థన్ తనను కోరినట్లు రమాదేవి ఆ ఫిర్యాదులో తెలిపారు.
వంశీ బెదిరింపులకు లొంగవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినలేదని, కేసు వాపసు తీసుకున్నాడని ఆరోపించారు. వల్లభనేని వంశీ మోహన్, ఆయన అనుచరులు సత్యవర్థన్ ను డబ్బుతో ప్రలోభ పెట్టారని, వినకుంటే చంపుతామని బెదిరించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐదుగురు నిందితులపై పటమట పోలీసు స్టేషన్ లో మరోకేసు నమోదైంది.