నెల్లూరు వైసీపీలో ఇద్దరు మాజీల సొంత డబ్బా రాజకీయం.. కేడర్ సతమతం

నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రాజకీయంపై పార్టీలో హాట్ టాపిక్ నడుస్తోంది.

Update: 2026-06-10 12:30 GMT

నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రాజకీయంపై పార్టీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో కేడర్ కు కొత్త తలనొప్పులు వస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారం లేని క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సింది పోయి, ఇద్దరు నేతలు 'సెల్ఫ్ గోల్' రాజకీయాలతో కేడర్‌ను గందరగోళంలో పడేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండేళ్లుగా ఇద్దరూ తమ మైలేజ్ పెంచుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, పార్టీ కోసం గొప్పగా పనిచేయడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు వైసీపికి కంచుకోట వంటి జిల్లాలో నేతలు ఇదే విధంగా నడిస్తే భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు.

ఆధిపత్యం కోసం క్రెడిట్ వార్

నెల్లూరు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య క్రెడిట్ వార్ ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ వైసీపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసనలలో నేతలు ఉమ్మడిగా పాల్గొంటే, నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ ఇద్దరు మాజీ మంత్రులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అంతటితో ఆగకుండా, జిల్లాలో నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కారణం నేనే అంటే నేనంటూ ఇద్దరు నేతలు ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అందరూ కలిసి ఉమ్మడిగా నిరసనను విజయవంతం చేశామని చెప్పుకోవాల్సింది పోయి, 'నా వల్లే పార్టీ నిలబడింది' అని సొంత డబ్బా కొట్టుకుంటూ తమ మధ్య విభేదాలను బయటపెడుతున్నారని అంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు నేతలూ ఓటమి చవిచూశారు. ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతర్గత విభేదాలు ఉండేవని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు నేతల్లో ఒకరు జిల్లా మొత్తం తన కనుసన్నల్లోనే నడుస్తోందని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా.. మరొకరు రెడ్డి సామాజిక వర్గం అంతా తన వెంటే ఉందనేలా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. వీరిలో ఒకరు కొంతకాలంగా సైలెంట్ కాగా, మరొకరు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ, పార్టీ ఇచ్చిన చిన్నపాటి నిరసన కార్యక్రమానికే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే తాపత్రయం ప్రదర్శించడం చూస్తుంటే వీరి ప్రాధాన్యతలు వేరుగా ఉన్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేడర్ లో అసహనం

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రకరకాల ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్న తరుణంలో నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలు మాత్రం ఒకరిని ఒకరు తక్కువ చేసి చూపించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. తాజా క్రెడిట్ వార్ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విభేదాలకు, వివాదాలకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు చూసి, ఏ వర్గం వైపు ఉండాలో తెలియక కేడర్ తలలు పట్టుకుంటోందని అంటున్నారు.

సంయమనం పాటించకపోతే అంతే సంగతులు

మాజీ మంత్రులుగా, సామాజిక వర్గాల్లో బలమైన నాయకులుగా చెలామణి అవుతున్న ఈ ఇద్దరు నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, ఇలాంటి చిన్న చిన్న నిరసన కార్యక్రమాల్లో కూడా ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు కోటలో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఈ మాజీలు తమ స్వప్రయోజనాలు, ఆధిపత్య పోరు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News