చరిత్రను మార్చేశారు.. మొఘలులను విలన్లు చేశారు

ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ఇటీవల విడుదల చేసిన 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన వివరణల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది;

Update: 2025-07-16 22:30 GMT

భారత విద్యా వ్యవస్థలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ఇటీవల విడుదల చేసిన 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన వివరణల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. "Exploring Society: India and Beyond – Part 1" అనే పేరుతో విడుదలైన ఈ పుస్తకం చరిత్ర బోధనలో కొత్త దృక్పథాన్ని ఆవిష్కరిస్తోంది.

ఈ కొత్త పాఠ్యపుస్తకం మొఘల్ పాలకులపై మునుపటి కంటే భిన్నమైన, లోతైన విశ్లేషణను అందిస్తోంది. కొన్ని సందర్భాల్లో మొఘల్ పాలకులను 'కఠిన విధానాలు తీసుకున్న పాలకులు'గా ప్రస్తావించింది. ఉదాహరణకు, బాబర్‌ను "బీభత్సమైన ఆక్రమణదారుడు"గా పేర్కొనగా, అక్బర్ పాలనలో ఉన్న సహిష్ణుతా విధానాలతో పాటు హింసాత్మక సంఘటనలను కూడా సమంగా చర్చించింది. ఇక ఔరంగజేబు పాలనను ధార్మిక అసహిష్ణుతకు ఉదాహరణగా చూపిస్తూ, ఆలయాలు, గురుద్వారాల ధ్వంసానికి సంబంధించిన వాస్తవాలను ప్రస్తావించింది.

- చీకటి ఘట్టాలపై ప్రత్యేక అధ్యాయం

చరిత్రలోని హింసాత్మక లేదా బాధాకరమైన సంఘటనలను విద్యార్థులు సమగ్రంగా అర్థం చేసుకునేలా, ఈ పుస్తకంలో “Note on Some Darker Periods in History” అనే ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు. అలాగే, “Reshaping India’s Political Map” అనే అధ్యాయంలో తిరుగుబాట్లు, యుద్ధాలు, సాంస్కృతిక స్థలాల ధ్వంసం వంటి కీలక అంశాలను చర్చించారు. ఈ మార్పులు చరిత్రను వాస్తవికంగా, వివరణాత్మకంగా బోధించాలనే ఎన్‌సీఈఆర్‌టీ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

- జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా...

ఈ పాఠ్యపుస్తకం ప్రస్తుత జాతీయ విద్యా విధానం 2020 కి అనుగుణంగా రూపొందించబడింది. చరిత్రను మరుగున పరచకుండా, నిజాలను బలంగా, స్పష్టంగా తెలియజేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. మొఘల్ చక్రవర్తుల పాలనపై కొత్త దృష్టికోణం ఇందులో ఆవిష్కరించారు. చరిత్రలో వెలుగు చూపించాల్సిన చీకటి ఘట్టాలపై ప్రత్యేక అధ్యాయం పెట్టారు. 7వ తరగతి నుంచి 8వ తరగతికి విషయాల మార్పు ను గమనించవచ్చు. అబద్ధాలు, అపార్థాలు లేకుండా, సత్యసంధమైన చరిత్ర బోధన లక్ష్యంగా ముందుకెళ్లారు.

పుస్తకంలోని డిస్‌క్లెయిమర్ ప్రకారం.. చరిత్రలో జరిగిన విషయాలకు నేటి సమాజంలో ఉన్న ఏ వ్యక్తి లేదా వర్గాన్ని బాధ్యులుగా చూడరాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మార్పులు విద్యార్థుల్లో చరిత్రపై లోతైన అవగాహనను పెంచి, సమకాలీన సమాజంలో హేతుబద్ధమైన దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News