'వాయిస్ ఆఫ్ ది పీపుల్'.. నారా లోకేష్!
రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు.. కష్టాలు.. కన్నీళ్లు తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన ప్రభుత్వం కీలక రోల్ పోషిస్తున్నట్టు చెప్పారు.;
వాయిస్ ఆఫ్ ది పీపుల్..(ప్రజాగళం) నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నారా లోకేష్ ముఖచిత్రంతో రూపొందిం చిన పుస్తకాన్ని ఆయన మహానాడు వేదికగా ఆవిష్కరించారు. తొలి ప్రతిని కూడా ఆయనే అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నారా లోకేష్‌కు చాలా భవిష్యత్తు ఉందన్నారు. యువతను తనవైపు తిప్పుకోవడంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు.. కష్టాలు.. కన్నీళ్లు తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన ప్రభుత్వం కీలక రోల్ పోషిస్తున్నట్టు చెప్పారు.
ఇక, వాయిస్ ఆఫ్ దిపీపుల్ పేరుతో నారా లోకేష్ ముద్రించిన ఈ పుస్తకం పూర్తిగా ఆయన సాగించిన యువగళం పాదయాత్ర నేపథ్యంలోనే తీసుకువచ్చారు. వైసీపీ హయాంలో గత ఏడాది ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు సంబంధించిన విశేషాలను కళ్లకు కట్టినట్టు దీనిలో పేర్కొన్నారు. అనేక మంది మహిళలు, యువత, రైతులు, మధ్యతరగతి ప్రజలను నారా లోకేష్ ఈ పాదయాత్రలో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారి కష్టాలు తెలుసుకుని పలు హామీలను కూడా ఇచ్చారు. ఆయా విశేషాలను ఈ పుస్తకంలో వివరించారు.
అదేవిధంగా యువగళం పాదయాత్ర సందర్భంగా చేసిన ప్రసంగాలు.. ఇచ్చిన హామీలను కూడా ప్రతిదీ దీనిలో వివరించారు. సచి త్ర మాలిక పేరుతో అనేక వందల ఫొటోలను కూడా ఈ పుస్తకంలో ముద్రించారు. ఇక, వైసీపీ హయాంలో జరిగిన యువగళం పాదయాత్రలో పోలీసులు అడ్డుకున్న తీరు, వైసీపీ నాయకులు చేసిన విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఇలా ఇతర అంశాలను కూడా హైలెట్ చేశారు. అన్ని అడ్డంకులను తట్టుకుని పాదయాత్రను నిర్వహించామని ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిందని నారా లోకేష్ పేర్కొన్నారు.
2023, జనవరి 27న చంద్రబాబుసొంత నియోజకవర్గం కుప్పంలో ప్రారంభమైన ఈ యువగళం పాదయాత్ర.. మొత్తం 226 రోజులు సాగింది. మధ్యలో కొన్ని విరామాలు తీసుకున్నా.. పాదయాత్రను మాత్రం పూర్తి చేశారు. మొత్తంగా 11 జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసిన పాదయాత్రలో 3,132 కిలో మీటర్ల మేరకు సాగింది. ఈ యాత్రకు సంబంధించిన విశేషాలతోనే నారా లోకేష్ ఈ పుస్తకాన్ని రూపొందించారు. కాగా.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నప్పుడు ఆయనకు కూడా ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం గమనార్హం.