రెడ్ బుక్‌లోకి వీరయ్య చౌదరి హంతకులు: నారా లోకేష్
ప్రజానాయకుడిగా ఎదిగిన వీరయ్య చౌదరి అన్నను కొందరు హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరు నిందితులుగా ఉన్నా.. వదిలి పెట్టేది లేదని చెప్పారు.;
టీడీపీ నాయకుడు, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాజీ మండల పరిషత్ సభ్యుడు(ఎంపీపీ) వీరయ్య చౌదరిని హత్య చేసిన వారి పేర్లను రెడ్ బుక్‌లో చేర్చనున్నట్టు మంత్రి నారా లోకేష్ చెప్పారు. తాజాగా ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చారు.ఈ సందర్భంగా తొలుత వీరయ్య చౌదరి ఇంటికి వెళ్లి.. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం.. చౌదరి సతీమణి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. వీరయ్య చౌదరికి తనకు మధ్య అన్నదమ్ముల అనుబం ధం ఉందన్నారు. తన యువగళం పాదయాత్రలో తనతో కలిసి వందల కిలో మీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు. తనతో కలిసి.. ప్రజల కష్టాలు విన్నారని.. ఆయన లేరన్న వార్త.. తనను ఎంతో కలిచి వేసింద న్నారు. ప్రజానాయకుడిగా ఎదిగిన వీరయ్య చౌదరి అన్నను కొందరు హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరు నిందితులుగా ఉన్నా.. వదిలి పెట్టేది లేదని చెప్పారు.
వారి పేర్లను కూడా రెడ్ బుక్‌లో చేర్చనున్నట్టు నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని, ఈ విషయంలో రాజీ ధోరణి వద్దని తాను పోలీసులకు కూడా చెప్పినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో జరిగినట్టు రాజకీయ హత్యలు తమ హయాంలో చేసేందుకే సాహసించే వారిని అస్సలు వదిలి పెట్టబోమన్నారు.
ఇప్పటికే పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారని.. కొందరు ఇప్పటికే పట్టుబడ్డారని చెప్పారు. అయితే.. అమాయకులను వేధిస్తున్నారన్న వైసీపీ నాయకుల వాదనను విమర్శలను నారా లోకేష్ తోసిపుచ్చారు. ఇది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమని, ఇక్కడ ప్రజా సేవకులే ఉంటారని.. నియంతలు ఉండబోరని.. అంతా పారదర్శకంగానే జరుగుతుందని చెప్పారు.