కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు పెద్ద కొడుకును: లోకేష్ భ‌రోసా

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు తాను పెద్ద కొడుకుగా ఉంటాన‌ని.. వారి బాగోగులు అన్నీ తానే చూసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు.;

Update: 2025-05-22 04:22 GMT

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు తాను పెద్ద కొడుకుగా ఉంటాన‌ని.. వారి బాగోగులు అన్నీ తానే చూసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న‌కు చెప్పాల‌ని.. త‌న ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌ని పేర్కొన్నారు. నేరుగా త‌న‌ను క‌లుసుకుని క‌ష్టం వెల్ల‌డించొచ్చ‌ని తెలిపారు. తాజాగా వైసీపీనేత‌ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన‌.. వెన్నా బాల‌కోటి రెడ్డి కుటుంబ స‌భ్యులు మంత్రి నారా లోకేష్‌ను క‌లుసుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన బాల కోటి రెడ్డి మాతృమూర్తి నాగేంద్ర‌మ్మ‌, సోద‌రులు లోకేష్‌కు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు.

నిరంత‌రం పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించేవాడ‌ని.. పార్టీ అంటే ప్రాణం పెట్టేవాడ‌ని నాగేంద్ర‌మ్మ చెప్పారు. అలాంటి త‌న కుమారుడిని అకార‌ణంగా వైసీపీనాయ‌కులు పొట్ట‌న పెట్టుకున్న‌ట్టుచెప్పారు. ఇంట్లో తాను ఒక్క‌డే సంపాయించే వ్య‌క్తి అని.. ఇప్పుడు త‌మ కు ఆధారం లేకుండా పోయింద‌ని విల‌పించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ వారిద్ద‌రినీ ఓదార్చారు. బాల‌కోటి రెడ్డి త‌నకు త‌మ్ముడు వంటి వాడ‌ని.. ఈ కుటుంబాన్ని ఆదుకుని, ఆద‌రించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని నారా లోకేష్ భ‌రోసా ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు పెద్ద కొడుకుగా తాను ఉంటాన‌ని చెప్పుకొచ్చారు.

త‌క్ష‌ణ సాయంగా కొంత న‌గ‌దును వెన్నానాగేంద్ర‌మ్మ‌కు అందించిన నారా లోకేష్ త్వ‌ర‌లోనే తాను ఇంటికి వ‌స్తాన‌ని.. చెప్పారు. అదేవిధంగా బాల కోటిరెడ్డిని హ‌త్య చేసిన ఏ ఒక్క‌రినీ వ‌దిలేది లేద‌ని చెప్పారు. రాష్ట్రంలో అరాచ‌కాల‌కు చెక్ పెడుతున్నామ న్నారు. అయినా.. కొంద‌రు రెచ్చిపోతున్నార‌ని.. వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నారా లోకేష్ తెలిపారు. త‌మ కుమారుడిని హ‌త్య చేసిన నిందితులు.. స్వేచ్ఛగా తిరుగుతున్నార‌ని, వారితో త‌మ‌కు ప్రాణాల‌కు కూడా ముప్పు ఉంద‌ని నాగేంద్ర‌మ్మ చెప్పారు.

అయితే.. ఎలాంటి భ‌యం అవ‌స‌రం లేద‌ని.. పార్టీ నాయ‌కులు అండ‌గా ఉంటార‌ని నారా లోకేష్‌ చెప్పారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. త‌న‌ను క‌లుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కాగా, గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండ‌లం టీడీపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన వెన్నా బాల‌కోటిరెడ్డిని వైసీపీ ప్ర‌త్య‌ర్థులు ప‌ట్ట‌ప‌గ‌లే హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

Tags:    

Similar News