చంద్రబాబు పాత్రలోకి లోకేశ్.. ఢిల్లీలో యువనేత హడావుడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు, యువ మంత్రి నారా లోకేశ్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు, యువ మంత్రి నారా లోకేశ్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానంలో సంపూర్ణంగా ఆయన బాధ్యతలను యువనేత లోకేశ్ భుజానకెత్తుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లాల్సిన కార్యక్రమాలకు సైతం లోకేశ్ హాజరవుతూ.. భవిష్యత్తుపై ఢిల్లీ స్థాయిలో సంకేతాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొంథా తుఫాన్ నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతోపాటు పలు ప్రాజెక్టులపై మంత్రి లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆయన ఢిల్లీలో అడుగుపెట్టడం, ఎంపీలు అందరితో సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై సమీక్షించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే లోకేశ్ ‘ముఖ్య’పాత్ర పోషించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులకు సీఎం హోదాలో ఆయనే నాయకత్వం వహించాల్సివుంటుంది. కానీ, గత కొన్ని నెలలుగా ఈ పద్ధతిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ పర్యటనలు లేదా పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలను కలుస్తున్న మంత్రుల బృందానికి లోకేశ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇది ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. సహజంగా ఇలాంటి పర్యటనలకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహించేవారు. కానీ, ఇప్పుడు ఆయన ఎక్కువగా రాష్ట్రంలోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. తన బదులుగా మంత్రి లోకేశ్ ను పంపిస్తున్నారు.
ఇదంతా గమనిస్తున్న వారు ముఖ్యమంత్రిగా లోకేశ్ కు బాధ్యతలు బదిలీ చేసే ముందు తగిన శిక్షణ ఇవ్వడమేనా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నుంచి పాలన అనుభవం నేర్చుకోవడం లోకేశ్ భవిష్యత్తుగా ఉపయోగపడుతుందన్న అలోచనతోనే.. ఆయనను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇటు పార్టీ.. అటు ప్రభుత్వ వ్యవహారాలలో ఇటీవల లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తాజాగా ఢిల్లీ పర్యటన మరో అదనపు ఉదాహరణగా వ్యాఖ్యానిస్తున్నారు. వరుస పర్యటనలు, ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులతో లోకేశ్ కొనసాగిస్తున్న సంబంధాలు వల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన పరపతి పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ఢిల్లీ పర్యటనలకు ఎక్కువగా లోకేశ్ మాత్రమే వెళుతున్నారు. ముఖ్యమంత్రి తరఫున ఆయనే ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం లోకేశ్ స్పీడుకు ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేశ్ ను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకున్న ప్రధాని మోదీ.. ఆయనతో సుమారు గంట పాటు చర్చించిన తర్వాత మళ్లీ మళ్లీ రమ్మంటూ పిలిపించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానితో లోకేశ్ భేటీ అయిన తర్వాతే ఏపీకి పలు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు తరలివచ్చాయి. ఇందులో గూగుల్, అర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు ఒక శాంపిల్ గా చూపుతున్నారు. తాజా పర్యటనలో సైతం లోకేశ్ తన బృందంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్లు కావడం గమనార్హం.
ఇక కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మంత్రి లోకేశ్.. అటు ఆర్ఎస్ఎస్ పెద్దలను ఆకర్షిస్తున్నారు. ఇటీవల మంత్రి లోకేశ్ తో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌జీ భేటీ అయ్యారు. ఈయన గతంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. త్వరలో జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు రామ్‌లాల్‌జీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రముఖులను కలుస్తున్నారు. ఇలా ఆర్ఎస్ఎస్ ప్రముఖుల జాబితాలో లోకేశ్ పేరు కూడా చేర్చడమే ఆసక్తికరంగా చెబుతున్నారు. ఇది లోకేశ్ సమర్థతకు బీజేపీ మాతృ సంస్థ ఇచ్చిన గుర్తింపుగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి లోకేశ్ అన్ని విధాలుగా, అందరి వైపు నుంచి పరిపూర్ణమైన మద్దతు కూడగట్టుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.