కసబ్ కోసం అంత ఖర్చు.. ఇప్పుడు తహవూర్ రాణా కోసం ఎంత?

ఈ మారణకాండకు సూత్రధారుల్లో ఒకడైన తహవూర్‌ హుస్సేన్‌ రాణాను విచారించేందుకు ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అనుమతించింది.;

Update: 2025-04-11 17:52 GMT

దేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయిన ముంబై ఉగ్రదాడి జరిగి 16 ఏళ్లు గడిచాయి. ఈ మారణకాండకు సూత్రధారుల్లో ఒకడైన తహవూర్‌ హుస్సేన్‌ రాణాను విచారించేందుకు ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో 2008 నవంబర్ 26న జరిగిన భయానక దాడులు, ఆ తర్వాత పరిణామాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ అందించారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు తహవూర్‌ రాణాకు అలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించవద్దని బాధితులు, దేశ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

ఈ తరుణంలో, సమాచార హక్కు చట్టం ద్వారా అథక్ సేవా సంఘ్ ఛైర్మన్ అనిల్ గాల్గాలీ సేకరించిన వివరాలు కసబ్‌పై అప్పట్లో పెట్టిన ఖర్చును వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కసబ్‌పై ఏకంగా రూ. 28.46 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలు, పుణెలోని యరవాడ జైలులో అతడి భోజనం, బట్టలు, వైద్యం, భద్రత వంటి ఖర్చులు ఉన్నాయి. ఉరిశిక్ష రోజున అతడి భోజనానికి రూ. 33.75, దుస్తులకు రూ. 169, అంత్యక్రియలకు రూ. 9,573 ఖర్చు చేసినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది.

- మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. కసబ్‌పై పెట్టిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి:

ఆహారం: రూ. 43,417.67

భద్రత: రూ. 1,50,57,774.90

మెడిసిన్: రూ. 32,097

దుస్తులు: రూ. 2,047

సెక్యూరిటీ: రూ. 5,25,16,542

అంత్యక్రియలు: రూ. 9,573

మొత్తం ఖర్చు: రూ. 6,76,49,676.82

ప్రస్తుతం ఎన్‌ఐఏ రిమాండ్‌లో ఉన్న తహవూర్‌ రాణా విషయంలోనూ విచారణ సుదీర్ఘంగా కొనసాగితే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాడు కసబ్‌పై పెట్టిన ఖర్చుతో పోలిస్తే, రాణా విషయంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. కసబ్‌ను 2012 నవంబర్ 21న ఉదయం 7:30 గంటలకు పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అతని క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉరిశిక్షకు రెండు వారాల ముందు తిరస్కరించారు.

మరి దేశాన్ని వణికించిన ముంబై ఉగ్రదాడికి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవూర్‌ రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాల్సి వస్తుందో వేచి చూడాలి. ప్రజల ఆకాంక్ష మేరకు అతడికి కసబ్‌లాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News