రాజీవ్ బతికి ఉంటే ముద్రగడ ముఖ్యమంత్రి అయ్యేవారా ?

రాజకీయాలు అంటేనే అనూహ్యమైన నిర్ణయాలకు నిలయం. ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.

Update: 2026-07-20 04:40 GMT

రాజకీయాలు అంటేనే అనూహ్యమైన నిర్ణయాలకు నిలయం. ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. పరిస్థితులు క్షణాలలో మారిపోవచ్చు. రాజులు అవుతారనుకున్న వారు తరాజులు కావచ్చు. అది చివరికి తలరాత అని కూడా అనుకోవాల్సి రావచ్చు. ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి 1984లో తన తల్లి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణించాక రాత్రికి రాత్రే అధ్యక్షుడు అయ్యారు, అంతే కాకుండా ఆయన అయిదేళ్ళ పాటు దేశ ప్రధానిగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడ్డారు. అయితే అనూహ్యంగా ఆయన 1989 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక 1991 మే 21న ఆయన తమిళనాడు శ్రీపెరుంబుదూర్ లో దారుణ హత్యకు గురి అయ్యారు. అయితే ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి ఎంతో తేడా ఉందని అప్పటి నాయకులు చెబుతూ ఉండేవారు.

యువ నేతలకు ప్రోత్సాహం :

రాజీవ్ గాంధీ యువ నేతలకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతోనే ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నియమించారు. అప్పటికి ఆయన వయసు 35 ఏళ్ళు మాత్రమే. అలాగే ఎంతో మంది యువతకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర మంత్రులుగా యువతకు పెద్ద పీట వేశారు. ఇదే క్రమంలో ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా సాదాసీదాగా మెలిగేవారు. ఎంతో మంది నాయకులతో కలసిపోయి వారిని దగ్గరకు తీశారు. అలాంటి వారిలో ఏపీలో ముద్రగడ పద్మనాభం కూడా ఒకరు. ఆయన రాజీవ్ గాంధీకు ఎంతగానో నచ్చేశారు. ఎంతలా అంటే ఏకంగా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటికి రాజీవ్ గాంధీ ప్రధాని హోదాలో ఉంటూ వచ్చేసినంతగా.

ముద్రగడ ప్రభావం :

ఇక 1988లో టీడీపీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేసి విజయవాడలో జరిగిన కాపునాడు సభకు ముద్రగడ హాజరై అక్కడ చేసిన ప్రసంగం ప్రకంపనలు పుట్టించింది. దాంతో కాంగ్రెస్ వారి కన్ను ఆయన మీద పడింది. ఆ తరువాత ఏపీ పర్యటనకు ప్రధాని హోదాలో వచ్చిన రాజీవ్ గాంధీ ముద్రగడ గురించి విని ఉండడంతో తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నేరుగా ఆయన ఇంటికే వెళ్ళి ఆతిధ్యం తీసుకోవడం ఆ రోజుల్లో పెను సంచలనంగా మారింది. ఇక ఆ తరువాత 1989 ఎన్నికలకు ముందు ఏపీలోనే ఒక భారీ బహిరంగ సభలో ముద్రగడను కాంగ్రెస్ పార్టీలోకి స్వయంగా రాజీవ్ గాంధీ ఆహ్వానించి ఆయనకు పార్టీ కండువా కప్పారు. ఏపీలో బలమైన సామాజికవర్గంగా కాపులు ఉన్నారని గుర్తించిన రాజీవ్ గాంధీ ఆనాటికి యువ నేతగా ఉన్న ముద్రగడని పార్టీలోకి తెచ్చి ఆయనకు కీలక స్థానం అప్పగించారు.

మంత్రి పదవితో ముద్రగడ :

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ముద్రగడను వరించింది. దీని వెనక కాంగ్రెస్ ఆగ్ర నాయకత్వం ఉంది అని అంటారు. ముద్రగడ వంటి వారి నాయకత్వాన్ని పార్టీ ఉపయోగించుకోవాలని కూడా కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఇక రాజీవ్ గాంధీ ముద్రగడకు ఇస్తున్న ప్రాధాన్యత చూసిన వారు అంతా ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కుతుందని భావించారు. అయితే 1991లో రాజీవ్ గాంధీ అనూహ్యంగా మరణించడంతో ముద్రగడకు రాజకీయంగా నష్టం జరిగింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి రేసులో :

అయినప్పటికీ అప్పట్లో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను నాటి కాంగ్రెస్ హైకమాండ్ మార్చింది. అయితే ఆయా సమయాలలో ముద్రగడ పేరు ముఖ్యమంత్రి రేసులో రావడం జరిగింది అని పాత తరం వారు గుర్తు చేసుకుంటారు. ఒకవేళ రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లు అయితే ముద్రగడ కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారని కాపుల చిరకాల కోరిక ఆ విధంగా నెరవేరేది అని కూడా అంటున్నారు. ఎందుకంటే కాపుల ఉద్యమ ఫలితంగానే 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తీరా కాంగ్రెస్ ఏలుబడిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినా అందులో ఒక్కరు కూడా కాపులు లేరని గుర్తు చేసుకుంటున్నారు. కాపుల ప్రాధాన్యత ముద్రగడ వంటి నాయకుల సమర్ధత బాగా ఎరిగిన రాజీవ్ గాంధీ ఉండి ఉంటే ఏనాడో కాపులకు న్యాయం జరిగేది రాజ్యాధికారం దక్కేదని అంటారు.

Tags:    

Similar News