ముద్రగడ నుంచి జగన్ ఆశిస్తోంది అదేనా ?
ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయనది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయనది అంతా పోరాటమే.;
ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయనది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయనది అంతా పోరాటమే. అధికార పార్టీలో ఆయన ఉన్నది బహు తక్కువ. ఇక ఆయన తాను అనుకున్న దాని కోసం ఎంతకైనా వెళ్తారు. ఆయనకు ఉన్న ఆ పట్టుదల వల్ల కొన్ని విజయాలు దక్కాయి. ఎక్కువ సార్లు ఇబ్బంది పడ్డారు.
ఇక ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని అనుకున్నారు. అయితే ఈ మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ మనసు మార్చుకుని వైసీపీలోకి వచ్చారు. ఆనాడు అలా జరగకపోయి ఉంటే ముద్రగడ రాజకీయమే వేరేగా ఉండేది అన్న చర్చ ఉంది. ఇక వైసీపీలో చేరిన ముద్రగడ 2024 ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో చిత్తశుద్ధితో పోరాడారు కానీ రిజల్ట్ చేదుగా వచ్చింది. ముద్రగడకు బాగా పట్టు ఉంది అని చెప్పుకునే పిఠాపురంలోనే వైసీపీకి ఘోరమైన ఫలితం దక్కింది.
ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక జగన్ ఇటీవల తన పార్టీకి సంబంధించిన పీఏసీని ప్రకటించారు. ఈ పీఏసీలో 33 మంది సీనియర్లు కీలక నేతలకు అవకాశాలు ఇచ్చారు. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుని ఈ కీలక స్థానం ఇచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా జగన్ తనదైన రాజకీయ వూహాన్ని రచించారు అని అంటున్నారు.
అలా కీలక పదవి ఇవ్వడం ద్వారా ముద్రగడ నుంచి భారీ రాజకీయ లాభాన్నే జగన్ కోరుకుంటున్నారు అని అంటున్నారు. ముద్రగడ అంటే ఈ రోజుకీ ఒక బ్రాండ్ ఉంది. ఆయన అంటే ఒక బలమైన సామాజిక వర్గం తమ గుండెల్లో పెట్టుకుంటుంది. ఆయన్ని ఆరాధ్యుడిగా చూస్తుంది. అయితే 2024 లో కూటమి ప్రభంజనంలో ముద్రగడ మాట చెల్లక పోవచ్చు కానీ 2029 నాటికి పరిస్థితి అలా ఉండదని భావించే ఆయనకు పార్టీలో కీలకం చేశారు అని అంటున్నారు.
ఆ విధంగా ఆయన్ని కార్యోన్ముఖుడిని చేస్తూనే గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ అధినాయకత్వం పడింది అని అంటున్నారు. కాపులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని పలు నియామకాలలో స్పష్టం చేస్తోంది అని అంటున్నారు. ఇక ముద్రగడను ముందు ఉంచి గోదావరి జిల్లాలలో వైసీపీ రాజకీయాన్ని చేస్తుందని అంటున్నారు.
ఇప్పటికే ఆయన కుమారుడు గిరికి పత్తిపాదు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి బాధ్యతలను అప్పగించిన వైసీపీ రానున్న రోజుల్లో ముద్రగడ సేవలను మరింతగా కోరుకుంటోంది. మొత్తం మీద పోయిన చోటనే వెతుక్కోవాలన్న పాత రాజకీయ సూత్రాన్నే జగన్ కొత్తగా అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ముద్రగడ తన శక్తియుక్తుల్ని ఏ విధంగా వైసీపీ కోసం వాడుతారో. ఆయన బలం ఆయనకు తెలియదు అంటారు. మరి ఇపుడు తన సత్తాను చాటే పనిలో పెద్దాయన ఉన్నారా అంటే తొందరలోనే జవాబు వస్తుంది అని చెబుతున్నారు