కొప్పుల ఫస్ట్ .. బూర నెక్స్ట్

కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి బీజేపీ అభ్యర్థి

Update: 2024-05-05 09:51 GMT

కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి బీజేపీ అభ్యర్థి. ఆయన ఫస్టేంటి ? ఈయన నెక్స్ట్ ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఇది ఎన్నికల పోటీ కాదు లేండి. ఈ నేతలు తమ వాహనాలను అధికవేగంతో నడిపించడం మూలంగా పోలీసులు విధించిన జరిమానాల్లో వారి వారి స్థానాలు అన్న మాట.

అతి వేగం ప్రమాద కరం. సీట్ బెల్ట్ ధరించండి. సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి. ఈ ట్రాఫిక్ సూత్రాలు నిరంతరం రహదారుల మీద గమనిస్తూనే ఉంటాం. చట్టసభలకు ఎన్నికై ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ప్రజా ప్రతినిధులే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుండడం విశేషం.

పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ వాహనం టీఎస్ 02ఈవై 0456పై జనవరి 15- ఏప్రిల్‌ 22 మధ్య అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణాలతో ఆరుసార్లు ఉల్లంఘించింది. దీనిపై సిద్దిపేట, మేడ్చల్‌, మంచిర్యాల పోలీసులు రూ.6210 జరిమానా విధించారు.

ఇక బీజేపీ భువనగిరి అభ్యర్ధి బూర నర్సయ్య టీఎస్09 ఎఫ్ఎస్6699 జనవరి 19న అతివేగంగా వెళ్తుండగా చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీ్‌సలు రూ.1,035 జరిమానా వేశారు. గత నెల 22న ఐఐసీటీ హబ్సిగూడ వద్ద అతివేగం కారణంగా నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు రూ.1035 జరిమానా విధించగా ఆ వెంటనే సెకన్‌ వ్యవధిలో మరో జరిమానా కూడా విధించడం గమనార్హం.

Read more!

కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్ధి నీలం మధు వాహనం (టీఎస్‌ 15ఎఫ్‌జే2345)పై నార్సింగి, మేడ్చల్‌, గజ్వేల్‌, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ స్టేషన్ల పరిధిలో రూ.3,305, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి సురేష్‌ షెట్కర్‌ వాహనంపై రూ.3,105, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ వాహనంపై రూ.2,070 వరకు చలాన్లు ఉన్నాయి.

సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పద్మారావు వాహనంపై రూ.1,035, నల్లగొండ నుంచి పోటీ చేస్తున్న కంచర్ల కృష్ణారెడ్డి వాహనంపై రూ.200 జరిమానాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ప్రజలు వారిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News