జగన్ కోటి సంతకాలు.. రుషికొండతో చంద్రబాబు జవాబు!

వైసీపీ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని ఆరోపిస్తూఆ పార్టీ కోటి సంతకాల ఉద్యమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే;

Update: 2025-12-17 13:46 GMT

మెడికల్ కాలేజీలపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని ఆరోపిస్తూఆ పార్టీ కోటి సంతకాల ఉద్యమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజల నుంచి సంతకాలు సేకరించడం పూర్తయిందని చెబుతున్న వైసీపీ.. ఆ పత్రాలను రాష్ట్ర గవర్నర్ నజీర్ కు గురువారం సమర్పించనుంది. ఇక మరోవైపు వైసీపీ కోటి సంతకాల ఉద్యమంపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వైసీపీ కోటి సంతకాలను కోడి సంతకాలు అంటూ విమర్శించారు. అదేవిధంగా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ కోటి సంతకాల ఉద్యమం ప్లాప్ అంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు.

మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం లేదని, పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గతంలో పీపీపీ విధానంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులను ఉదహరిస్తున్న చంద్రబాబు.. ప్రతిపక్షం వైసీపీ విమర్శలను తిప్పికొట్టేందుకు రుషికొండ ప్యాలస్ ను ఎత్తిచూపారు. తమ ప్రభుత్వం అమలు చేయనున్న పీపీపీ విధానం వల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నామని వైసీపీ చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయంగానే సీఎం చంద్రబాబు కొట్టిపడేశారు.

పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆజమాయిషీలోనే పనిచేయనున్నాయని సీఎం వివరిస్తున్నారు. నిబంధనలు అన్నీ ప్రభుత్వమే నిర్దేశిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. మాజీ సీఎం జగన్ హయాంలో ప్రజాధనాన్ని వృధా చేశారని సీఎం విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించి ఉంటే ఇప్పుడు పీపీపీ విధానంలో వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు చంద్రబాబు. విశాఖ రుషికొండపై రూ.550 కోట్లతో ఫ్యాలెస్ నిర్మించారని, ఆ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రుషికొండపై ప్యాలెస్ తెల్ల ఏనుగులా మారిందని వ్యాఖ్యానించారు.

పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలలో ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయా మెడికల్ కాలేజీలలో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతాయని, సీట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతోందని గుర్తుచేశారు. విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బాధ్యత అధికారులు కూడా తీసుకోవాలని, తమ స్థాయిలో ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News