దేశం సంచలన ఫలితాలను చూడబోతోందా ?

ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ కే ఆ క్రెడిట్ ఇప్పటిదాకా ఉంటూ వచ్చింది.

Update: 2024-05-23 15:02 GMT

ఈసారి జాతీయ రాజకీయాల్లో సంచలన ఫలితాలు నమోదు అవుతాయని విశ్లేషణలు ఉన్నాయి. అది ఎలా అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి వరసగా మూడోసారి గెలిచి అధికారం చేపట్టినా ఒక పెను సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ కే ఆ క్రెడిట్ ఇప్పటిదాకా ఉంటూ వచ్చింది. 1952 నుంచి వరసగా జరిగిన ఎన్నికలను తీసుకుంటే పండిట్ నెహ్రూ తొలి ప్రధానిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో 1952, 1957, 1962లో కూడా కాంగ్రెస్ దేశంలో వరసగా గెలిచింది.

అలా హ్యాట్రిక్ రికార్డుని తొలిసారి సొంతం చేసుకున్న నెహ్రూ 1964లో మరణించారు. ఇక ఆయన రాజకీయ వారసురాలిగా అధికారాన్ని 1966లో చేపట్టి దేశానికి తొలి మహిళా ప్రధాని అయిన శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో 1967, 1971లలో రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆమె హ్యాట్రిక్ విజయం అయితే సాధించలేకపోయారు. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు అయి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Read more!

ఆ తరువాత 1980లో ఇందిరా మరోసారి గెలిచినా 1984లో రాజీవ్ గాంధీ నాయకాత్వంలో కాంగ్రెస్ వరసగా రెండోసారి గెలిచినా ఆ ఊపుని 1989లో కంటిన్యూ చేయలేకపోయారు. ఇక వరసగా రెండేసి మార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం అన్నది వాజ్ పేయి నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా చేసి చూపించింది.

ఇక 2004, 2009లలో యూపీయే కూడా వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇక 2014, 2019లలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే సర్కార్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి అంటే 2024 లో కనుక మోడీ తిరిగి అధికారంలోకి వస్తే నెహ్రూ రికార్డుని సమం చేసినట్లు అవుతుంది. అంటే 1962 నాటి మాదిరిగా తిరిగి 62 ఏళ్ల తరువాత తన ప్రజాకర్షణ శక్తితో మోడీ సాధించి చూపించారు అని చెప్పుకోవాల్సిందే.

అయితే బీజేపీ కానీ ఎన్డీయే కానీ తమ విజయం మీద ధీమా పడుతూంటే ఇండియా కూటమి అంతే స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అయితే దేశంలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు నమోదు అవుతాయని అంటున్నారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ఓడిపోబోతోంది అని చెప్పి సంచలనం సృష్టించారు. మోడీ రాజ్యాంగం మీద రిజర్వేషన్ల మీద దాడి చేశారు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

అందువల్ల ఈసారి దేశంలో వచ్చే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలవబోతోంది అని అన్నారు. అంతే కాదు ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లను ఇండియా కూటమి గెలుచుకుంటుందని మరో మాట చెప్పారు. మోడీ పట్ల బీజేపీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని అది తమ ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది అని రాహుల్ గాంధీ అన్నారు.

మొత్తం మీద చూస్తే ఇండియా కూటమి ధీమా చూసినా ఒక వేళ విపక్షం అధికారం చేపట్టినా దేశ రాజకీయాల్లో సంచలన ఫలితాలు నమోదు అవుతాయి అంటున్నారు. అదే విధంగా చూస్తే మోడీ మూడవసారి వచ్చినా అది కూడా అద్భుతమైన ఫలితం అవుతుంది. మొత్తానికి చూస్తే ఈసారి ఫలితాలు దేశమంతా ఆసక్తిని రేపనున్నాయన్నది వాస్తవం అని అంటున్నారు. ఇంకా రెండు విడతల పోలింగ్ మాత్రమే ఉన్న వేళ ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News