పార్లమెంటు 'ప్రత్యేక భేటీ'పై అనుమానపు నీడలు!
దేశ పార్లమెంటు.. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేకంగా భేటీ అవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రధాని మోడీ కూడా.. చెప్పుకొచ్చారు.;
దేశ పార్లమెంటు.. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేకంగా భేటీ అవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రధాని మోడీ కూడా.. చెప్పుకొచ్చారు. రెండు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1) మహిళల రిజర్వేషన్ అంశం. 2) నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండు అంశాల కోసమే ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి అన్ని భాషల పత్రికల్లోనూ ఆయన వ్యాసాలు రాశారు.
అంతేకాదు.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. మేధావులతోనూ చర్చలు చేస్తున్నారు. అయితే.. ఈ పార్లమెంటు సమావేశాలపై అనేక అనుమానాలు ఉన్నాయని.. తాజాగా విపక్షాలు పేర్కొంటున్నా యి. ప్రధానంగా 3 కారణాలు పేర్కొంటున్నాయి.
1) రెండు కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు నిర్వహించడం: ఇలా చేయడం ద్వారా మహిళా పక్షపాతిగా మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. త ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేయొచ్చని భావిస్తున్నట్టు ఆరోపిస్తున్నాయి.
2) లోక్‌సభ, రాజ్యసభల్లో ఇతర కార్యక్రమాలు: ఈ ప్రత్యేక భేటీలో ఉభయ సభల్లో ఇతర ఏ విషయాలు చేపట్టబోమని ఇరు సభలు ప్రకటించాయి. వాస్తవానికి ఇది ప్రత్యేక భేటీ అయినప్పటికీ.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగానే జరుగుతున్నాయి. కాబట్టి ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కానీ.. దీనికి ఉభయ సభలు ససేమిరా అంటున్నాయి. దీంతో ఇది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
3) మహిళా రిజర్వేషన్: దీనికి సంబంధించి 2024-25 మధ్యే చట్టం అయింది. మరోసారి.. దీనిపై చర్చ చేపట్టడం ఎందుకు? అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న.` నారీ శక్తి వందన` పేరుతో చట్టం ఇప్పటికే రెడీ అయిందని.. మరోసారి దీనిపై చర్చ చేపట్టడం ద్వారా.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈప్రత్యేక భేటీకి వెళ్లాలా? వద్దా? అనే విషయంపై ప్రతిపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి.