ట్రంప్ దూకుడుపై మోడీ మౌనం ఎందుకు? అసలు కారణం ఇదేనా?
ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు స్పందించటం లేదు? ఆయన మౌనం వెనుక ఉన్న లెక్కలేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.;
ఒక విషయాన్ని గమనించారా? ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న ఎడాపెడా నిర్ణయాల విషయంలో మోడీ సర్కారు స్పందించటం లేదు. తనకు మంచి స్నేహితుడంటూ మోడీని ఉద్దేశించి ట్రంప్ ఇప్పటికి మూడు.. నాలుగుసార్లు ప్రస్తావించి.. అయినప్పటికీ మోడీ తన దేశం మీద భారీగా సుంకాలు విధిస్తున్న ఆగ్రహాన్ని ప్రదర్శించటం తెలిసిందే. మిగిలిన దేశాలకు తగ్గట్లే.. భారత్ మీదా 26 శాతం ప్రతీకార సుంకాన్ని విధించటం తెలిసిందే. దీంతో.. దీని ఎఫెక్టు దేశంలోని వివిధ వ్యాపారాల మీద పడినట్లుగా చెప్పాలి.
ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు స్పందించటం లేదు? ఆయన మౌనం వెనుక ఉన్న లెక్కలేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొదట్నించి మోడీ.. ట్రంప్ ఇద్దరు మంచి స్నేహితులు. గతంలో ఆయన ఎన్నికల ప్రచారానికి దేశ ప్రధానిగా ఉన్న మోడీ అవేమీ పట్టించుకోకుండా నేరుగా అమెరికాకు వెళ్లి.. ట్రంప్ తరఫు ప్రచారం చేయటం లాంటివి గుర్తుకు తెచ్చుకుంటే.. మరిప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్లు? అన్నది ఆసక్తికరం.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. భారత్ ను ఉద్దేశించి ఏమైనా నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తే.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే స్పందించే అలవాటు ఉంది. పలు సందర్భాల్లో భారత్ మీద చేసే విమర్శలకు ఆయన ధీటుగా సమాధానాలు ఇవ్వటం కనిపిస్తుంది. ఈ తీరుకు భిన్నంగా ట్రంప్ నిర్ణయాలపైనా.. ప్రతీకార సుంకాల మీదా స్పందించింది లేదు. చివరకు అక్రమ వలసల్ని తిరిగి పంపిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. ఆయన స్పందించలేదు.
ఎందుకిలా? కారణం ఏమై ఉంటుంది? అన్నది ప్రశ్నగా మారింది. మోడీ చేతకానితనంతోనే ఇదంతా జరుగుతుందని కొందరు నోరు పారేసుకుంటున్న పరిస్థితి. అయితే.. మోడీ గురించి తెలిసిన వారు మాత్రం.. ఆయన ఏదో ఆలోచనలో ఉండి ఉంటారని అందుకే మౌనంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా మిత్రుడి గురించి మరో మిత్రుడికి బాగానే తెలుస్తుంది. అలానే ట్రంప్ తీరు గురించి మోడీకి ఐడియా లేకుండా ఉండదు కదా?
తెంపరితనంతో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ కు ఎన్ని చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ విషయం తెలిసే.. తనదైన టైం కోసం మోడీ వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుకు తగ్గట్లే కొన్ని అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతీకార సుంకం నేపథ్యంలో కొన్ని దేశాల మాదిరి రివర్సులో సుంకాల విధింపు ఆలోచనను మోడీ చేస్తారా? అంటే.. లేదనే మాట స్పష్టంగా చెప్పేస్తున్నారు. ట్రంప్ చర్యకు భారత్ నుంచి ఎలాంటి ప్రతి చర్య ఉండదని కేంద్ర ప్రభుత్వంలోని ఒక కీలక అధికారి స్పష్టం చేయటం గమనార్హం. అయితే.. తాజాపరిస్థితుల్లో ప్రతీకార చర్యల మాదిరి కాకుండా ఒప్పందాల పేరుతో ఇలాంటి వాటికి చెక్ పెట్టే వీలుందంటున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమవుతుందని చెబుతున్నారు.