రాహుల్ ఉంటే మోడీకి హ్యాపీ నేనా ?

నరేంద్ర మోడీనే ప్రధానిగా చూసేందుకు ఈ రోజుకీ దేశంలో అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడుతున్నారు.

Update: 2026-08-30 03:45 GMT

నరేంద్ర మోడీనే ప్రధానిగా చూసేందుకు ఈ రోజుకీ దేశంలో అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడుతున్నారు. మోడీకి ఈ విషయంలో రెండో మాట లేకుండా జై కొడుతున్నారు. మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చేసినవనీ జనాలకు నచ్చి కాదు, అలాగే ఎన్డీయే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని కూడా కాదు, ఎన్డీయే సర్కార్ ప్రజా వ్యతిరేక విధనాలు కూడా అనేకం ఉన్నాయి. అంతే కాదు సగటు ప్రజానీకంతో పాటు మధ్యతరగతి వర్గాలు కూడా అనేక సమస్యలు పడుతున్నారు. కానీ ఈ దేశానికి ప్రధానిగా ఎవరు అన్న ప్రశ్న వచ్చేసరికి మాత్రం మోడీయే కావాలని బలంగా కోరుకుంటున్నారు. తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ ప్రముఖ సంస్థలు చేసిన సర్వేలో కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం అయింది. దాంతో మోడీ నాలుగోసారి దేశానికి ప్రధాని కావడం ఖాయమని బీజేపీ నేతలు అయితే సంతోషంగా ఉన్నారు. ఇంతకీ మోడీనే జనాలు కోరుకోవడం వెనక ఆయన ఇమేజ్ ఆయన బలం తో పాటు ఇతర పరిణామాలు కూడా కారణం అవుతున్నాయని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

పెద్ద గీత పక్కన అలా :

నరేంద్ర మోడీ ఈ రోజున దేశంలో అత్యంత సీనియర్ నాయకుడు. ఇది ఎవరు కాదన్నా ఒప్పుకోవాల్సిన విషయం. ఆయన ప్రధాని కాక ముందే 13 ఏళ్ల పాటు గుజరాత్ కి సీఎం గా ఉన్నారు. ఇక ప్రధానిగా వరసగా మూడు సార్లు గెలిచారు పుష్కర కాలంగా ఆ పదవిలో ఉన్నారు. మరో మూడేళ్ళు కూడా కొనసాగుతారు. మోడీ విషయంలో అవినీతి మరక లేదు, నిజాయతీపరుడు అన్న ముద్ర ఉంది. ఆయనకు కుటుంబం అంటూ సొంతంగా లేకపోవడం వల్ల కూడా ఆయనను జనాలు మెచ్చి దేశానికి సారధ్యం అప్పగించడానికి అనుకూలించే మరో అంశంగా ఉంది. అయితే ఇవన్నీ ఒక వైపు ఉంటే మోడీని ఎందుకు వ్యతిరేకించాలంటే కారణాలు కూడా ప్రత్యర్థి పార్టీలు చెబుతాయి. మరి అవి జనాల చెవికి ఎందుకు ఎక్కడం లేదు అంటే అక్కడ మ్యాజిక్ ఉంది. మోడీ వర్సెస్ అదర్స్ అంటూ కొన్ని పేర్లు తెస్తూండడం వల్ల వారంతా ఆయన ముందు చిన్న బోతున్నారు. మోడీ పెద్ద గీత అయితే వారు చిన్న గీతగా కనిపిస్తున్నారు. దాని వల్ల కూడా మోడీకి జై కొట్టాల్సిన పరిస్థితి వస్తోంది అన్నది సిసలైన విశ్లేషణగా ఉంది.

తేలిపోతున్నారుగా :

ఇక భారతదేశం అంటే అతి పెద్ద దేశం. దాని బాధ్యతలు మోయాలి అంటే అనుభవం ఎంతగానో ఉండాలి. అలాగే సీనియార్టీ ఉండాలి. ఈ దేశానికి ప్రధానులుగా చేసిన వారిని చూస్తే ఒక్క రాజీవ్ గాంధీ తప్పించి అంతా విశేష అనుభవం ఉన్న వారే. రాజీవ్ గాంధీ కూడా నాలుగేళ్ల పాటు తన తల్లి శ్రీమతి ఇందిరా గాంధీ వద్ద రాజకీయ శిక్షణ పొందారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయినా ఆయన ప్రధాని అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ లో కొంత చర్చ సాగింది. అయితే ఇందిరా గాంధీ హత్య తరువాత సానుభూతి పవనాలు వీచడంతో ఆయన ప్రధాని కాగలిగారు. ఇపుడు చూస్తే రాహుల్ గాంధీకి అలాంటి పరిస్థితి లేదు, పైగా ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు, పైగా ఆయన రెండు దశాబ్దాల కాలంలో చూస్తే రాజకీయంగా రాటుదేలుతున్నా ఇంకా అది సరిపోదు అన్నది మెజారిటీ జనం భావంగా ఉంది. దానికి తోడు బీజేపీ జాతీయ వాదం బలంగా వ్యాప్తి చెందుతోంది. కాంగ్రెస్ ఈ విషయంలో రొటీన్ పాలసీనే నమ్ముకుంటోంది. గతానికి పోలిస్తే ఈ రోజున భారత్ కి మరింత ముప్పు అన్ని వైపుల నుంచి ఉంది. అందుకే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే అన్ని రకాలుగా ఆలోచించి మరీ జనాలు మోడీకే ఓటు వేస్తున్నారు అని అంటున్నారు.

కాంగ్రెస్ ఆలోచించాల్సిందే :

ఈ నేపథ్యంలో మోడీ వర్సెస్ రాహుల్ అంటూ జరిగిన మూడు ఎన్నికల్లో మోడీకే జనాలు ఓటెత్తారు. కాబట్టి 2029 నాటికి అయినా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. రాహుల్ గాంధీకి బదులు ఆ పార్టీ ప్రియాంక గాంధీని ముందుకు తెచ్చినా బెటర్ గా ఉంటుందని అంటున్నారు. ఆమె తాజా అభ్యర్ధిగా ముందుకు వస్తారని మహిళగా ఆమెకు అడ్వాంటేజ్ ఉంటుందని, ఇందిరాగాంధీ పోలికలు నానమ్మ సెంటిమెంట్ సైతం కలసి వస్తుందని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేస్తే ఈ శతాధిక వృద్ధ పార్టీ పుంజుకుంటుంది అని అంటున్నారు. లేకపోతే మాత్రం మోడీ శిబిరం ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ దీని మీద కొత్త ఆలోచనలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News