బస్సు నుంచి దూకారు.. 500 మెట్లు ఎక్కారు.. నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డారు

ఒక్కసారిగా కొండపై నుంచి దూసుకొచ్చిన వరద.. కళ్లముందే కొట్టుకుపోతున్న వాహనాలు.. తప్పించుకునేందుకు క్షణాల సమయం మాత్రమే.. ఏం చేయాలో తెలియని భయం.. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతారు.

Update: 2026-08-30 05:03 GMT

ఒక్కసారిగా కొండపై నుంచి దూసుకొచ్చిన వరద.. కళ్లముందే కొట్టుకుపోతున్న వాహనాలు.. తప్పించుకునేందుకు క్షణాల సమయం మాత్రమే.. ఏం చేయాలో తెలియని భయం.. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. కానీ ఆ దంపతులు మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. కదులుతున్న బస్సు నుంచి దూకేశారు. ఆ తర్వాత ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని 500 మెట్లు ఎక్కారు. చివరకు ఓ చిన్న షెడ్డులో రాత్రంతా తలదాచుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా దంపతులు పట్టాభిరామన్ వెంకటేశన్, అంజన రాజా ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి మాటల్లో చెప్పాలంటే.. అది తమ జీవితంలోనే అత్యంత భయానకమైన కొన్ని నిమిషాలు.

‘బస్సు వైపు వరద దూసుకొచ్చింది.. వెంటనే దూకేశాం’

కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా ఈ దంపతులు నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. రసువా జిల్లాలోని తిమురే గ్రామం వద్ద వారి టూరిస్టు బస్సు వెళ్తుండగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హిమాలయ ప్రాంతంలో మంచు కరగడం.. భారీ వర్షాల ప్రభావంతో కొండ ప్రాంతాల నుంచి నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. అది సాధారణ వరదలా కనిపించలేదు. క్షణాల్లోనే భారీ మట్టి ప్రవాహం బస్సు వైపు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన గైడ్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఇక బస్సులో ఉండటం ప్రమాదకరమని గ్రహించిన యాత్రికులు బయటకు పరుగులు తీశారు. అంజన, పట్టాభిరామన్ కూడా మరో ఆలోచన లేకుండా బస్సు నుంచి దూకేశారు. 500 మెట్లు.. ప్రతి అడుగూ ప్రాణం కోసం పోరాటం చేశారు. బస్సు నుంచి బయటపడటం మొదటి దశ మాత్రమే. అసలు సవాలు అప్పుడే మొదలైంది. వరద ప్రవాహం నుంచి దూరంగా వెళ్లేందుకు సమీపంలోని కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లేందుకు ఉన్న దాదాపు 500 మెట్లను వారు అత్యంత వేగంగా ఎక్కారు. వెనుక నుంచి వస్తున్న వరద.. కింద ప్రమాదకర పరిస్థితులు.. ముందు తెలియని దారి. అయినప్పటికీ ఆగలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి చేరుకున్నారు. ఆ సమయంలో తమకు ఎదురైన పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ షాక్‌కు గురవుతున్నామని వారు చెబుతున్నారు. చివరకు కొండపైకి చేరుకున్న తర్వాత ఓ షెడ్డులో ఆశ్రయం పొందారు. రాత్రంతా అక్కడే గడిపారు.

‘బతికి బయటపడటం మిరాకిల్‌లా ఉంది’

ఆ రాత్రి తమకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ఈ దంపతులు ఇప్పటికీ దానిని నమ్మలేకపోతున్నారు. కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని చెబుతున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే.. “మేం బయటపడటం ఇప్పటికీ షాక్‌గా మిరాకిల్‌లా ఉంది.” అని తెలిపారు.

నేపాల్‌లోని రసువా ప్రాంతంలో వరదలు, కొండచరియలు, మట్టి ప్రవాహాల కారణంగా పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. పలువురు యాత్రికులు, స్థానికులు గల్లంతయ్యారు.

యాత్రకు వెళ్లి.. మరణాన్ని కళ్లముందు చూసి..

కైలాస మానస సరోవర యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లిన ఈ దంపతులు అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సింది పోయి.. ప్రకృతి విలయాన్ని ప్రత్యక్షంగా చూశారు. హిమాలయాల అందాలను చూడాలని బయలుదేరిన ప్రయాణం.. చివరకు ప్రాణాల కోసం పరుగెత్తిన పోరాటంగా మారింది. అయితే ప్రమాద సమయంలో గైడ్ అప్రమత్తత, వెంటనే బస్సు నుంచి బయటకు రావాలన్న నిర్ణయం, కొండపైకి వేగంగా చేరుకోవడం వారికి కలిసొచ్చింది.

ప్రస్తుతం వారు నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకు చేరుకున్నారు. తమ అనుభవాన్ని వివరిస్తూ.. వరదల సమయంలో తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే తమ జీవితాలను కాపాడిందని చెబుతున్నారు. ప్రయాణం కోసం బయలుదేరిన ఇద్దరు.. చివరకు ప్రాణాలతో తిరిగొచ్చారు. 500 మెట్లు వారికి సాధారణ మెట్లు కాదు.. అవే ఆ రోజు వారి జీవితానికి, మరణానికి మధ్య నిలిచిన 500 అడుగులుగా చెప్పొచ్చు.




Tags:    

Similar News