టీడీపీలో 'బీచ్' వార్: ఎంపీ VS ఎమ్మెల్యే ..!
బాపట్ల జిల్లా అధికార పార్టీ తెలుగుదేశంలో వర్గపోరు పరాకాష్టకు చేరింది. అక్కడ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు కాస్తా ఇప్పుడు సూర్యలంక బీచ్ నిర్మాణాలు, అభివృద్ది పనుల చుట్టూ తిరుగుతోంది.
బాపట్ల జిల్లా అధికార పార్టీ తెలుగుదేశంలో వర్గపోరు పరాకాష్టకు చేరింది. అక్కడ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు కాస్తా ఇప్పుడు సూర్యలంక బీచ్ నిర్మాణాలు, అభివృద్ది పనుల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని భావించిన ప్రజలకు, నేతల మధ్య మొదలైన అంతర్గత పోరుతో వారు నలిగి పోతున్నారు.
గతంలో బాపట్లలో రియల్ ఎస్టేట్ వెంచర్ల అనుమతుల విషయంలో ఎమ్మెల్యే నిబంధనలు కఠినతరం చేయడంతో కొందరు వ్యాపారులు ఎంపీ కృష్ణప్రసాద్‌ను ఆశ్రయించారని, దాంతో ఇద్దరి మధ్య మొదటిసారి విభేదాలు బయటపడ్డాయని స్థానికంగా ప్రచారం ఉంది. ఆ తర్వాత ఇసుక, బుసక తవ్వకాలు, లిక్కర్ షాపుల కేటాయింపుల్లోనూ రెండు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగింది. చివరకు ఇది రాజకీయ ఆధిపత్యపోరుగా మారింది.
తాజాగా ఈ విభేదాలు ‘సూర్యలంక బీచ్’ అభివృద్ధి పనుల వద్దకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘స్వదేశీ దర్శన్’ పథకం కింద బీచ్‌లో టూరిజం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అక్కడి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నరేంద్రవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న టాయిలెట్లు, రెస్ట్‌రూమ్‌లను తొలగించాలని ఒక ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
బీచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఒక ప్రైవేటు హోటల్ ముందు ఈ టాయిలెట్లు రాకూడదనే ఉద్దేశంతోనే ఆ ప్రజాప్రతినిధి అధికారులకు హుకుం జారీ చేశారని, దానికి ఎంపీ మద్దతు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టాయిలెట్లు తొలగిస్తే ఊరుకునేది లేదని, ఈ విషయాన్ని పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హోటల్ యాజమాన్యానికి మద్దతుగా ఎంపీ చక్రం తిప్పుతున్నారనే ప్రచారం నడుస్తుండగా, ఎమ్మెల్యే నేరుగా సవాల్ విసరడంతో బాపట్ల రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.