ప్రాంతీయ పార్టీలు బాబుని చూసి నేర్చుకోవాల్సిందే !
చంద్రబాబుని రాజకీయ ప్రత్యర్థులు కూడా కొన్ని విషయాల్లో పొగడకుండా అసలు ఉండలేరు.
చంద్రబాబుని రాజకీయ ప్రత్యర్థులు కూడా కొన్ని విషయాల్లో పొగడకుండా అసలు ఉండలేరు. ఆయన విధానాలతో ఏకీభవించలేని వారు సైతం బాబు కష్టపడే మనస్తత్వం చూసి ప్రశంసలు కురిపిస్తారు. బాబు లాంటి పనిమంతుడు ఎవరూ ఉండరని అంటారు. రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు ఒక డిఫరెంట్ లీడర్. ఆయన రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తారు. పార్టీ కోసం అంతలా పనిచేసే నాయకుడు బాబు తప్ప మరొకరు కనిపించరు. ఎంతో మంది పార్టీలు పెట్టారు, సక్సెస్ కూడా చూశారు. కానీ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై అయిదు రోజులూ పార్టీని పట్టుకుని ఉండేవారు బాబు తప్ప మరొకరు కనిపించరు. అందుకే టీడీపీ అత్యంత పటిష్టంగా తయారు అయింది. మరో యాభై ఏళ్ల పాటు నిలిచి గెలిచే సత్తాను సంతరించుకుంది.
పేరు పెట్టి పలకరించే తీరు :
చంద్రబాబుకు పనిచేసే ముఖ్య కార్యకర్తల పేర్లు కూడా తెలుసు. ఆయన జిల్లాల పర్యటనకు వచ్చినపుడు వారిని పేరు పెట్టి పిలవడం చూసి అక్కడ ఉన్న వారు అంతా ఆశ్చర్యపోతారు. ఏం బాగున్నావా అని బాబే పలకరించే సరికి పులకరించడం ముఖ్య కార్యకర్త వంతు అవుతుంది. దటీజ్ చంద్రబాబు అని చెప్పాలి. మరి ఆయన ఎన్ని సార్లు పార్టీ సమావేశాలు పెట్టి జిల్లాల వారీగా మధింపు చేసుకోకపోతే ఇలా పేరు పెట్టి పిలిచేటంత జ్ఞాపకశక్తి ఉంటుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఒక రాష్ట్ర స్థాయి అధినేత జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాలలో ముఖ్య నాయకులతో నేరుగా పరిచయాలు చేసుకోగల సత్తా వేరే పార్టీలో చూడగలరా అన్నదే అంతా ఆలోచించాల్సిన విషయం.
వన్ టూ హండ్రెడ్ ఆయనే :
ఇక టీడీపీలో వన్ టూ హండ్రెడ్ గా బాబే కనిపిస్తారు. ఆయనకు పనిచేయడం ఇష్టం పార్టీ అంటే ఇంకా ఇష్టం. కార్యకర్తలు అంటే కూడా అభిమానం. అందుకే ఆయన ఎవరికో పార్టీ పనులు అప్పచెప్పి తాను ఎక్కడో విశ్రాంతి తీసుకోవాలని కలలో కూడా అనుకోరు. ఆయనే స్వయంగా ప్రతీ మీటింగ్ పెడతారు, చిన్న స్థాయి సమావేశానికి కూడా బాబు హాజరవుతారు అంటే పార్టీతో ఆయనకు ఉన్న అద్భుతమైన అనుసంధానానికి అది ఉదాహరణగానే చూడాల్సి ఉంటుంది. ఇక బాబులో మంచి నాయకుడు ఉన్నారు, ఆయనవి చాణక్య వ్యూహాలు. ఆయనకు వేరే వారు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక బాబుకు అంటూ ప్రత్యేకంగా కోటరీ ఉందని ఆయన మొత్తం నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో విమర్శలు రాలేదు, ఇక బాబు తానుగా క్యాడర్ తో భేటీలు వేస్తారు, ఎవరైనా తనను కలుసుకోవాలంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు. దాంతో టీడీపీలో బాబుకు క్యాడర్ కి అడ్డు తెరలు అన్నవి లేనే లేవు, అలాగే నాయకులతో అంతకంటే లేవు. మొత్తం అన్ని జిల్లాల మీద పార్టీ మీద బాబుకు ఉన్న పట్టు కూడా గొప్పది అని చెబుతారు.
నడపడం అంటే తమాషానా :
జాతీయ స్థాయిలో పార్టీల అధినేతలు ఎంతో మంది నాయకులను నియమించుకుని పార్టీని నడపవచ్చు. అక్కడ కోటరీలు ఎన్ని ఉన్నా చెల్లుతాయేమో కానీ ప్రాంతీయ పార్టీలలో అవి కుదరవు. ఎందుకంటే ఈ పార్టీలు నడిచేవే నాయకుడి ఇమేజ్ మీద ఆధారపడి. అధినాయకుడు స్వయంగా చెబితేనే ఏ నాయకుడు అయినా వింటాడు, అంతే తప్ప ఎవరో ఒకరిని ముందు పెట్టి వారి చేత చెప్పిస్తే నొచ్చుకుంటాడు, తప్పుకుంటాడు, అలాగే క్యాడర్ కూడా నాయకులు ఎంత మంది ఉన్నా అధినాయకుడినే చూస్తూంటుంది. అధినాయకుడి మాటనే వింటుంది. అలాంటపుడు అధినాయకుడు ఎంతగా క్యాడర్ తో లీడర్ తో కనెక్ట్ అయితే అంతలా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. అంతకు మించి పార్టీ అంతా కట్టుగా పటిష్టంగా ఉంటుంది. అలా కాదని ఎవరో ఒకరిని బాధ్యతలు అప్పగించి అధినాయకుడు తెర వెనక ఉంటే మాత్రం ఆ పార్టీకి వేరే శత్రువులు ఎవరూ అవసరం లేదు, ఉన్న వారే చాలు పార్టీ కొంప ముంచడానికి. అందుకే పార్టీలు ఎవరైనా పెట్టవచ్చు. కానీ నడపాలంటే ఎంతో కష్టపడాలి. రిలాక్స్ అన్నది రాజకీయాల్లోనే ఉండదు, పార్టీల అధినేతలకు అంతకంటే ఉండరాదు, ఆ సంగతి తెలియని పార్టీలు మాత్రం నిరంతరం సంస్థాగతంగా లోపాలతో సతమతం అవుతుంటాయి. అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక పార్టీని ఎలా సక్సెస్ ఫుల్ గా నడపడం ఎలాగో బాబును చూసి ప్రాంతీయ పార్టీల అధినేతలు నేర్చుకోవాలని అంటారు.