బీసీలా.. కాపులా.. బెజవాడ టీడీపీ మేయర్ ఎవరు.. ?
విజయవాడ, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లు రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్లుగా పేరు తెచ్చుకున్నాయి దీంతో ఆయా పదవులకు కూడా అంతే డిమాండ్ ఉంది.
విజయవాడ, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లు రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్లుగా పేరు తెచ్చుకున్నాయి దీంతో ఆయా పదవులకు కూడా అంతే డిమాండ్ ఉంది. ఈ రెండు కార్పొరేషన్లలో మేయర్ పదవులకు కూడా భారీ పోటీ ఉంటుంది. ఇక, ఈ రెండు స్థానాలు ప్రస్తుతానికి జనరల్ కేటగిరీలోనే ఉన్నాయి. అయితే.. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదు కాబట్టి.. వచ్చే 10 -15 రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పలేం. ప్రస్తుతానికి ఈ రెండు మేయర్ పీఠాలు జనరల్‌లోనే ఉన్నాయి.
మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యం.. స్థానికంగా ఉన్న పొలిటికల్ ఎఫెక్ట్ కారణంగా బెజవాడ మేయర్ పీఠానికి మరింత ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో దీనిని దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతుంటాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఈ రెండుచోట్లా పాగా వేసింది. ఇక, విజయవాడ విషయానికి వస్తే.. జనరల్ అయినా బీసీలను తమవైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ అప్పట్లో నగరాలు సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళకు బెజవాడ మేయర్ పీఠాన్ని అప్పగించింది.
ఇక, ఇప్పుడు మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అది కూడా టీడీపీలోనే ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మేయర్ పీఠం జనరల్ అయినప్పటికీ.. ఆ వర్గానికే కేటాయించాలని టీడీపీ లోని కొందరు నాయకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు నాయకురాళ్ల పేర్లు కూడా తెరమీదికి వస్తున్నాయి. దీనికి దన్నుగా.. పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బుద్దా వెంకన్న కూడా.. బీసీలకే ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో కాపుల కోటాలో ఈ సీటు ఆ వర్గానికి కేటాయించాలని టీడీపీ లో మరో వర్గం కోరుతోంది. కాపు సామా జిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ మేయర్ స్థానాన్ని వారికి కేటాయిస్తే.. పార్టీపై సానుభూతి పెరుగుతుందని.. కాపులు ఏకమవుతారని అంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు సామాజిక వర్గాల మధ్య బెజవాడ మేయర్ పీఠం వ్యవహారం చర్చకు వస్తోంది. గతంలో కూడా టీడీపీ బీసీ మహిళ పంచుమర్తి అనురాధకు మేయర్ పీఠం అప్పగించింది. ఆ తర్వాత ఇదే పార్టీ కమ్మ సామాజికవర్గానికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదికి రావడం గమనార్హం. మరి ఏ చేస్తారో ? చూడాలి.