ఐపీఎల్ అవుట్.. మిస్ వరల్డ్ పోటీలు మాత్రం యథాతధం

అయితే.. ఐపీఎల్ టోర్నీకి.. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.;

Update: 2025-05-10 04:38 GMT

భారత - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ పోటీలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. వారం వరకు నిరవధికంగా ఈ టోర్నీని నిలిపేశారు. అదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను మాత్రం షెడ్యూల్ లో భాగంగా కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నీకి నో చెప్పి.. మిస్ వరల్డ్ పోటీలకు ఎస్ చెప్పటం ఏమిటి? అన్న ప్రశ్న కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే.. ఐపీఎల్ టోర్నీకి.. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఐపీఎల్ టోర్నీకి.. మిస్ వరల్డ్ పోటీలకు ఉన్న తేడా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐపీఎల్ పోటీల్ని నిర్వహిస్తుంటారు. ఇందుకోసం భారీ స్టేడియంలో నిర్వహిస్తుంటారు. అందుకు భిన్నంగా మిస్ వరల్డ్ పోటీలు మాత్రం కేవలం తెలంగాణ.. అందునా హైదరాబాద్ తో పాటు.. కొన్ని ప్రాంతాలకే ఈ పోటీ పరిమితం కానుంది. మరీ.. అవసరం అనుకుంటే.. బయట ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల్ని కుదించి.. కొన్ని వేదికలకే పరిమితం చేసేందుకు వీలు ఉంది.

అన్నింటికి మించి.. మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్ లో నిర్వహించటం.. భారత్.. పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి నుంచి యుద్దం వరకు వెళ్లినప్పటికీ.. హైదరాబాద్ మీద అంత త్వరగా ప్రభావం పడదన్న మాట వినిపిస్తోంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా నిర్వహించే క్రికెట్ మ్యాచ్ ను ఓపెన్ స్టేడియంలో నిర్వహించటం.. వేలాది మంది ఒకేచోట ఉండటం లాంటి ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్న పరిస్థితి. అందుకు భిన్నంగా మిస్ వరల్డ్ రెండు.. మూడు వేదికలు.. అది కూడా భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రముఖ హోటళ్లలో నిర్వహిస్తుండటం ఒక సానుకూల అంశంగా చెప్పాలి. ప్రపంచ స్థాయిలో అందరి చూపు పడే టోర్నీని నిలిపేయటం వల్ల దీన్ని నిర్వహించే సత్తా లేదన్న నెగిటివ్ భావన పడే వీలుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని.. మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహణను ఒకేలా చూడకూడదని చెబుతున్నారు.

Tags:    

Similar News