పాకిస్థాన్ కోసం పనిచేస్తున్న అస్సాం వాసులు.. మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏడుగురి అరెస్టు
మన మిలటరీ ఇంటెలిజెన్స్ అప్రమత్తత మూలంగా భారీ నష్టం తప్పింది. అస్సాం పోలీసుల పకడ్బందీ చర్యలతో దేశద్రోహానికి పాల్పడుతున్న ఏడుగురి ఆటకట్టింది.;
మన మిలటరీ ఇంటెలిజెన్స్ అప్రమత్తత మూలంగా భారీ నష్టం తప్పింది. అస్సాం పోలీసుల పకడ్బందీ చర్యలతో దేశద్రోహానికి పాల్పడుతున్న ఏడుగురి ఆటకట్టింది. తప్పుడు చిరునామాలతో మన దేశంలో సిమ్ కార్డులు తీసుకుంటూ పాకిస్థాన్ చేరవేస్తున్న పెద్ద ముఠా గుట్టురట్టు చేశారు మన పోలీసులు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో ఒకడు తెలంగాణలోని సంగారెడ్డిలో తలదాచుకోవడం ఉలికిపాటుకు గురిచేసింది.
పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఉగ్ర మూకలకు ఆపరేషన్ సింధూర్ తో మన త్రివిధ దళాలు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వరుసగా వెలుగుచూస్తున్న ఉగ్ర లింకులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో విధ్వంసానికి ప్లాన్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులను ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అస్సాం పోలీసులు మరో భారీ కుట్రను ఛేదించారు.
మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో ‘ఆపరేషన్ ఘోస్ట్ సిమ్’ పేరుతో రంగంలోకి దిగిన అస్సాం పోలీసులు మూడు రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అస్సాం డీజీపీ హర్మీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం మిలటరీ ఇంటెలిజెన్స్ కు చెందిన గజరాజ్ కార్ప్స్ నుంచి పాకిస్థానులో వాడుతున్న ఘోస్ట్ సిమ్ నంబర్లపై అస్సాం పోలీసులకు సమాచారం వచ్చింది. మన దేశంలో సిమ్ కార్డులను కొనుగోలు చేసిన వాటి ద్వారా వాట్సాప్, ఇన్ స్టా, టెలిగ్రాం వంటి సోషల్ ప్లాట్ ఫామ్స్ లో పాకిస్థాన్ లో లాగిన్ అవుతున్నారు. ఈ నంబర్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడటమే కాకుండా, ఉగ్రవాదానికి ప్రయత్నిస్తున్నట్లు అస్సాం డీజీపీ వెల్లడించారు.
మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు ఏడుగురు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అయితే వీరంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే కావడం గమనార్హం. వీరితోపాటు మరో 14 మందికి ఈ కేసుతో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాగా, నిందితుల నుంచి సీజ్ చేసిన 948 సిమ్ కార్డులు, అక్రమ కమ్యూనికేషన్ కు ఉపయోగించే పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అస్సాం, రాజస్థాన్, తెలంగాణల్లో వేర్వేరుగా తిష్ట వేసిన ఈ ముఠా నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను సేకరించి పాకిస్థాన్ పంపుతున్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. మన దేశం నుంచి పాక్ చేరిన సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి పలు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. మన దేశ టెలిఫోన్ నెంబర్లతో పాకిస్థాన్ నుంచి ఫోన్లు చేస్తూ సైనికులపై హనీట్రాప్ తోపాటు భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే ఆపరేషన్ సింధూర్ తో ఈ వ్యవహారం వెలుగుచూడటం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ ఐఎస్ఐకి చెందిన వారు మన దేశం నుంచి సేకరించిన సిమ్ కార్డులను వాడటాన్ని మన మిలటరీ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఆపరేషన్ సింధూర్ సమాచారం తెలుసుకోడానికి ఆ సిమ్ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాట్సాప్ లో సందేశాలు రావడంతో అసలు గుట్టు రట్టు అయిందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వాట్సాప్ సందేశాల సిమ్ అడ్రసులు మన దేశంలో చూపగా, వాట్సాప్ వినియోగం పాక్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన మిలటరీ ఇంటెలిజెన్స్ సిమ్ కార్డులు ఎక్కువగా అస్సాం అడ్రసులతో ఉండటంతో ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి సమాచారమిచ్చింది.