జగన్ ఓటమిపై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ ని ఆ యాంకర్ ఏపీలో వైసీపీ పెద్ద ఎత్తున అయిదేళ్ల పాటు సంక్షేమ పధకాలు అమలు చేసింది అని గుర్తు చేశారు.
ఏపీలో వైఎస్ జగన్ ఓటమి చెంది రెండేళ్ళకు పై దాటింది. వైసీపీ ఎందుకు ఓడింది అన్న దాని మీద ఈ రోజుకీ ఆ పార్టీకి సరైన సమాధానం దొరకడం లేదు, మేము ఎందుకు ఓటమి చెందామని వైసీపీలోనే ప్రశ్నించుకుంటున్నారు తప్ప ఇవీ కారణాలు అని స్పష్టంగా తెలుసుకోలేని స్థితి ఉంది. దానికి కారణం వారు ఆత్మ పరిశీలన చేసుకోలేదని నిజయతీగా సమీక్ష నిర్వహించుకోలేదని రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈవీఎంల వల్లనే ఓటమి చెందామని కొందరు వైసీపీ నేతలు అంటూంటే మరి కొందరు మాత్రం వైసీపీ అతి విశ్వాసం వల్ల అని అంటున్న నేపథ్యం ఉంది. అయితే అధినాయకత్వం మాత్రం ఈ రోజుకీ ఓటమికి పక్కా క్లారిటీతో రీజన్స్ ని చెప్పలేకపోతోంది అన్నది ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ ఓటమి మీద తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే ఓడారు అంటూ :
ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ ని ఆ యాంకర్ ఏపీలో వైసీపీ పెద్ద ఎత్తున అయిదేళ్ల పాటు సంక్షేమ పధకాలు అమలు చేసింది అని గుర్తు చేశారు. ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను డీబీటీ విధానంలో ప్రజలకే నేరుగా అందించారని కూడా చెప్పారు. ఇంత జరిగినా కూడా జగన్ ఓడిపోయారు అని చెప్పారు. తెలంగాణాలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేసామని మీరు చెబుతున్నారు, మరి ఇక్కడా అంతే అవుతుందేమో అన్నది యాంకర్ వ్యక్తం చేసిన సందేహం. దానికి మహేష్ కుమార్ గౌడ్ బదులిస్తూ వైసీపీకి పార్టీ నిర్మాణమే లేదని కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను జనాలకు చెప్పుకోలేకపోయి ఉండవచ్చు అని కూడా అన్నారు. అందుకే అక్కడ ఓటమి చెందవచ్చు అన్నారు. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి అలా కాదని తమకు గ్రాస్ రూట్ లెవెల్ దాకా పెద్ద ఎత్తున క్యాడర్ ఉందని, లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు అని చెప్పారు. అందువల్ల తాము ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను జనంలో ఎప్పటికపుడు ఉంచుతున్నామని అందుకే గెలుస్తామని ధీమాగా చెప్పారు.
వైసీపీకి తెలుసా ఇది :
మరి తెలంగాణా పీసీసీ చీఫ్ ఏపీలో వైసీపీ ఓటమి గురించి ఇచ్చిన విశ్లేషణ బాగానే ఉంది. ఈ సంగతి వైసీపీ పెద్దలకు తెలుసా అన్నదే ప్రశ్న నిజంగా సంస్థాగతంగా లోపాలు ఉంటే వైసీపీ ఓటమి తరువాత ఏమైనా చర్యలు తీసుకుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ రోజుకీ మాటలకే తప్ప చేతలలో క్యాడర్ గురించి పట్టించుకోవడం లేదని వైసీపీలో వినిపిస్తున్న మాట. దాంతో వైసీపీకి ఓటమి గురించిన కారణాలు తెలిసినా లేక తెలియకపోయినా తిరిగి తాము అధికారంలోకి వచ్చేందుకు కూటమి వ్యతిరేకత చాలు అని భావిస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ తో విడిపోయి కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుని ఒకసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఓటమి మీద తెలంగాణా పీసీసీ చీఫ్ కామెంట్స్ చేయడం మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయని అంటున్నారు.