వైసీపీలో జగన్ డమ్మీ...నిజమేనా ?
వైసీపీ ఎవరిది అంటే వెంటనే వచ్చే జవాబు జగన్ అని వస్తుంది. కాంగ్రెస్ నుంచి వేరు పడి జగన్ సొంతంగా వైసీపీని స్థాపించారు.
వైసీపీ ఎవరిది అంటే వెంటనే వచ్చే జవాబు జగన్ అని వస్తుంది. కాంగ్రెస్ నుంచి వేరు పడి జగన్ సొంతంగా వైసీపీని స్థాపించారు. ఆయన వైసీపీని పటిష్టపరచేందుకు జనంలో తిరిగారు. పాదయాత్రలు చేశారు, అలా జగన్ ఇమేజ్ తోనే వైసీపీ అనే పార్టీ ఏపీలో నిలిచి ఉంది. ఏపీలో టీడీపీ వంటి బలమైన పార్టీని తట్టుకుని వైసీపీ కొనసాగుతుంది అంటే దానికి జగన్ ఇమేజ్ ప్రధాన కారణం అన్నది తెలిసిందే. ఇక జగన్ మామూలు నాయకుడు కాదు, ఆయన కష్టాలు ఓర్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే మొండితనం పట్టుదల కలిగిన వారు. ఆ లక్షణాలు నచ్చే ఏపీలో 40 శాతం ఓటు బ్యాంక్ వైసీపీకి జనం సమకూర్చారు. ఇక జగన్ నాయకత్వం కనుక లేకపోతే 2014లో తొలిసారి భారీ ఓటమి చూసిన తరువాత వైసీపీ అపుడే అంతరించిపోయేది. ఇక 2024లో కేవలం 11 సీట్లతో వైసీపీ చేదు ఫలితాలు అందుకుంది. ఆ వెంటనే వైసీపీ ముక్కలు చెక్కలు అయిపోయేది. కానీ ఈ రోజుకీ వైసీపీ బలమైన పార్టీగా ఉంది అంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం సహ జగన్ అన్నది అందరికి తెలిసిందే.
నంబర్ వన్ కారా :
అలాంటి వైసీపీలో జగన్ నంబర్ వన్ కారా. ఈ మాట వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. జగన్ కాకుండా వేరే వారు నంబర్ వన్ అంటే కూడా అది విస్మయం గొలుపుతుంది. అయితే అదే నిజం అంటున్నారు వైసీపీలో పునాదుల నుంచి ఉన్న నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన జగన్ తో సుదీర్ఘ కాలం పాటు కలసి ప్రయాణించారు. జగన్ మీద అక్రమ కేసులు పెడితే ఆయనతో పాటు పదహారు నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన వారు విజయసాయిరెడ్డి. ఇక జగన్ ఒక్కరే కాదు వైఎస్సార్ అలాగే వైఎస్ రాజారెడ్డి మూడు తరాలుగా వైఎస్సార్ కుటుంబంతో పనిచేసిన వారు విజయసాయిరెడ్డి. మరి ఆయన చెప్పే మాటలకు విలువ ఉంటుందా అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నపుడు ఈ తరహా విమర్శలు చేస్తే వాటికి నిజంగా విలువ ఎక్కువ. కానీ ఆయన పార్టీని వీడిపోయారు. పైగా ఏణ్ణర్థం తరువాత విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దాంతో ఇవి చర్చకు బాగుంటున్నాయి కానీ నిజంగా వైసీపీలో అలాగే జరుగుతోందా అన్నది కూడా అయితే ఆలోచించాల్సిందే అంటున్నారు.
ఏదో జరుగుతోంది :
అయితే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని ఆయన వైసీపీ మీద కక్ష కట్టి ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు అనుకోవడానికి కూడా పూర్తిగా లేదు, ఆయన ఇపుడు వైసీపీని ఎంతలా బదనాం చేసినా ఆయనకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండదు, ఎందుకంటే ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నా వచ్చి చేరేవారు ఎవరూ ఉండరు, అదే ఆయన మరో పార్టీలో చేరి ఈ తరహా విమర్శలు చేసి ఉంటే అక్కడ ఆయన ప్లేస్ ని పదిలం చేసుకోవడానికి అని అనుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఇపుడు సుదీర్ఘమైన లేఖలు రాసి వైసీపీ మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నేరుగా జగన్ మీదనే బాణాలు వేస్తున్నారు అంటే అక్కడ ఏదో జరుగుతోంది అన్న భావన మాత్రం సామాన్య జనంలో ఉంది. దానికి తగినట్లుగా పార్టీలో కార్యకలాపాలు జరుగుతున్నాయని అంటున్నారు.
జగన్ ఎక్కడ :
ఈ ప్రశ్నకు జవాబు వేసుకుంటే చాలు విజయసాయిరెడ్డి ఆరోపణలలో ఎంతో కొంత మ్యాటర్ ఉంది అని అనుకుంటారు. జగన్ గడచిన రెండేళ్లకు పైగా వైసీపీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు అన్నది అంతా అంటున్నదే. అదే సమయంలో ఆయన జనంలోకి కూడా వెళ్లడం లేదు, ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కానీ పార్టీ మీటింగులు కానీ అన్నీ జగన్ లేకుండానే జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం ఈ రోజుకీ ఎదురుచూసే వారు ఎందరో నాయకులే ఉన్నారని అంటున్నారు. ఇక కార్యకర్తలకు అయితే అది దుర్లభం అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది.
చుట్టూ కోటరీ ఉందని :
జగన్ చుట్టూ కోటరీ ఉందని కూడా విజయసాయిరెడ్డి గతంలో చెప్పారు. మరి ఇపుడు ఆ కోటరీ వల్లనే జగన్ ని నేతలు అంతా సులువుగా కలుసుకోలేకపోతున్నారా అన్న చర్చ ఉంది. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోయారు అని ఆయన చేస్తున్న విమర్శలను కొట్టి పారేయడానికి లేదు అన్న మాట ఉంది. వైసీపీ భిన్నమైన రాజకీయ పార్టీగా ఉంది అన్నది తెలిసిందే. టీడీపీ లాంటి చోట్ల అధినాయకులే అన్ని కార్యక్రమాలలో కనిపిస్తారు, వైసీపీ ఆ తరహా దృశ్యాలు అయితే కనిపించవు. అందుకే విజయసాయిరెడ్డి వైసీపీలో జగన్ డమ్మీ అని నంబర్ టూ అని అంటూంటే అంతా ఆలోచిస్తున్నారు. దాని మీదనే సీరియస్ గా చర్చిస్తున్నారు కూడా.