వర్షాలు, వాతావరణ హెచ్చరికలు పెరుగుతున్నాయి.. భారత్ ఎంత సిద్ధంగా ఉంది?
అలాగే నగరాల్లో కురిసే ప్రతి భారీ వర్షం వరదగా మారడానికి కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కారణం కాదు.
ఒకప్పుడు భారీ వర్షమంటే కొన్ని గంటల్లో లేదా ఒకటి రెండు రోజుల్లో కురిసిపోయే వానగా మాత్రమే చూసేవాళ్లం. కానీ నేడు వాతావరణ పరిస్థితులు తీవ్రమైన మార్పులకు గురవుతున్నాయి. అతి భారీ వర్షాలు, హఠాత్తుగా ముంచెత్తే వరదలు, పిడుగుపాట్లు, తుపాన్లతో పాటు తీవ్రమైన వేడి తరంగాలు రోజువారీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకే దేశంలో ఒక ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తుతుంటే మరో ప్రాంతంలో తీవ్రమైన ఎండలు, తీవ్ర నీటి కొరత లభిస్తున్నాయి. ఈ విధమైన అస్థిర వాతావరణం పెరిగిపోతున్న నేపథ్యంలో తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ ఎంతవరకు సిద్ధంగా ఉందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
గతంతో పోలిస్తే భారతదేశం వాతావరణ అంచనా విభాగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. అత్యాధునిక ఉపగ్రహ సాంకేతికత, రాడార్ నెట్‌వర్క్‌లు, న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ సహాయంతో ముందస్తు హెచ్చరికలను జారీ చేసే సామర్థ్యం భారత వాతావరణ శాఖకు పెరిగింది. ప్రత్యేకించి బంగాళాఖాతం, అరబిక్ సముద్రాల్లో ఏర్పడే తుపాన్లను రోజు ముందే కచ్చితంగా అంచనా వేసి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో మన వ్యవస్థలు మంచి విజయం సాధించాయి. అయితే కేవలం ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం మాత్రమే విపత్తు నిర్వహణలో సంపూర్ణ విజయం అనిపించుకోదు.
ఇక్కడ అత్యంత కీలకమైన సవాలు లాస్ట్-మైల్ కమ్యూనికేషన్. వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలు అధికారిక వెబ్‌సైట్‌లు, మొబైల్ అలర్ట్‌ల వరకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు, నది పరివాహక ప్రాంతాల్లోని కుటుంబాలకు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు తగిన సమయంలో వారు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో చేరడం అత్యవసరం. హెచ్చరికను తయారు చేయడం ఒకెత్తయితే దాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలు తమని తాము రక్షించుకునేలా చర్యలు చేపట్టేలా చేయడం అసలైన లక్ష్యం.
అలాగే నగరాల్లో కురిసే ప్రతి భారీ వర్షం వరదగా మారడానికి కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కారణం కాదు. పట్టణాలలో సహజంగా నీరు ప్రవహించే కాలువలు, చెరువులు, వరద మైదానాలు అక్రమ నిర్మాణాలకు గురికావడం, నగర ప్లానింగ్‌లో లోపాలు, పాతబడిపోయిన డ్రైనేజీ వ్యవస్థలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. డ్రైనేజీ సామర్థ్యానికి మించి నీరు వస్తున్నప్పుడు కాంక్రీట్ విస్తరణ వల్ల నీరు ఇంకే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది. అందుకే అర్బన్ ఫ్లడింగ్‌ను కేవలం అతి భారీ వర్షంతో మాత్రమే సరిపోల్చడం సరైంది కాదు.
మరోవైపు విపత్తు జరిగాక రంగంలోకి దిగే ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసు వ్యవస్థల రెస్క్యూ సామర్థ్యం మెరుగ్గానే ఉన్నప్పటికీ అసలు విపత్తు సంభవించక ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలలో లోపాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే కాలువలు శుభ్రం చేయడం, ప్రమాదకర నిర్మాణాలను గుర్తించడం, ఉష్ణగాలుల సమయంలో అత్యంత ప్రమాదంలో ఉన్న వర్గాలకు రక్షణ కల్పించడం వంటి ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. దీనితో పాటు కేంద్ర, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి అధికారుల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో పాత పద్ధతులతో మౌలిక సదుపాయాలను నిర్మించడం ప్రమాదకరం. భవిష్యత్తులో నిర్మించే రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ వ్యవస్థలు తీవ్ర వాతావరణ మార్పులను తట్టుకునేలా రూపొందించాలి. నేడు మనకు కేవలం వాతావరణం గురించి సమాచారం ఇచ్చే వ్యవస్థ మాత్రమే కాకుండా.. హెచ్చరిక వచ్చిన వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే వెదర్-రెస్పాన్సివ్ పరిపాలన అత్యంత ఆవశ్యకం. ప్రకృతి విపత్తులను సంపూర్ణంగా ఆపడం మన చేతుల్లో లేకపోయినా.. సరైన ప్రణాళికతో వాటి ప్రభావం వల్ల జరిగే నష్టాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు.