ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు.. రాజీనామాకు ఆదేశం.. అసలు కారణమిదేనా?

ఈ సంచలన నిర్ణయానికి ప్రధాన కారణాలు ఏమిటనే దానిపై హైదరాబాద్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Update: 2026-08-29 05:52 GMT

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిష్కరణతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా తక్షణమే రాజీనామా చేసి.. ఆ లేఖను శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్‌.ఏ. హుస్సేన్‌ అన్వర్‌ పేరుతో ప్రకటన విడుదలైనట్లు సమాచారం.

వివాదాలు, వైరల్ వీడియోల చుట్టూ రాజకీయాలు

ఈ సంచలన నిర్ణయానికి ప్రధాన కారణాలు ఏమిటనే దానిపై హైదరాబాద్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇటీవల సోషల్‌ మీడియాలో ఆయనకు సంబంధించినవిగా ప్రచారంలోకి వచ్చిన కొన్ని వివాదాస్పద వీడియోలు, వాట్సాప్ చాట్‌లు, మరికొన్ని తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలోనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదని.. ఇవన్నీ సోషల్ మీడియా వ్యాఖ్యల ఆధారంగా ఉన్నాయని ఆయన వర్గీయులు అంటున్నారు.

డీప్‌ఫేక్‌, సైబర్ క్రైమ్ కేసుల కలకలం

ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందే మీర్జా రహ్మత్‌ బేగ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను సృష్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. సదరు వీడియోలను నెట్‌లో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు పాతబస్తీకి చెందిన ఓ జర్నలిస్ట్ అత్తాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యవహారంలో చేసిన ఆరోపణలు కూడా వైరల్‌ అయ్యాయి. అత్తాపూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండగా మీర్జా పట్టుబడ్డారని ఈ ఓల్డ్ సిటీ జర్నలిస్టు ఆరోపించారు. కొందరు యువకులు ఆయనను కొట్టి, వీడియోలు తీశారన్నారు. కాగా అవి డీప్ ఫేక్ వీడియోలంటూ మొన్న ఎమ్మెల్సీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే వైరల్ అవుతున్న కంటెంట్ అసలైనదా లేక డీప్‌ఫేక్‌ సాంకేతికతతో సృష్టించినదా అన్నది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

పార్టీ కఠిన వైఖరి.. భవిష్యత్తు పరిణామాలు

పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, ప్రతినిధులు ఎవరైనా సరే చట్టానికి, పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. ఆ సూత్రానికే కట్టుబడి అధిష్ఠానం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

2023లో హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్‌ బేగ్‌ పదవీకాలం 2029 మే వరకు ఉంది. ఇంకా సుదీర్ఘ కాలం మిగిలి ఉన్నప్పటికీ, పార్టీ ఆదేశాల ప్రకారం ఆయన రాజీనామా చేస్తారా లేక చట్టపరమైన, రాజకీయపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News