రంగంలోకి ధర్మాన వారసుడు ?
ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావునే ఇంచార్జిగా అధినాయకత్వం నియమించింది.
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు రాజకీయ చాణక్యుడు అని పేరు ఉంది. ఆయన సర్పంచ్ నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక సార్లు మంత్రిగా పనిచేశారు. అలాగే ఎమ్మెల్యేగా పలు దఫాలు గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ఉన్న ప్రసాదరావు వైసీపీలో కూడా తన పలుకుబడిని అలాగే కొనసాగిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రసాదరావు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ఈసారి ఆయన పోటీ చేయడానికి కాదు, తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కోసమే అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల కోసం :
నరసన్నపేట నుంచి కొన్ని సార్లు శ్రీకాకుళం నుంచి మరి కొన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాదరావు నిజానికి రాజకీయ విరమణ ప్రకటించాల్సి ఉంది. 2024 ఎన్నికల్లోనే ఆయన దానిని అధినేత జగన్ కి చెప్పారు. కానీ జగన్ మాత్రం ఆయనకే టికెట్ ఇచ్చారు. అలా ఆయన ఇష్టం లేకుండా పోటీకి దిగి ఒక జూనియర్ నాయకుడి చేతిలో యాభై వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ అసంతృప్తితోనే ఆయన చాలా కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే రెండేళ్ళ పై దాటిన కూటమి పాలనను చూసిన ఆయన ఇపుడు జనంలోకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడు రాజకీయాన్ని సెట్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు అన్నీ కూడా రామ్ మనోహర్ నాయుడుకే అప్పగించారని అంటున్నారు.
ఇంచార్జిగా ఉన్నా :
ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావునే ఇంచార్జిగా అధినాయకత్వం నియమించింది. ఆయనే సారధ్యం వహించాలని కోరుకుంటోంది. కానీ ధర్మాన మాత్రం కుమారుడిని యాక్టివ్ చేస్తున్నారు. దాంతో పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా రామ్ మనోహర్ నాయుడే చూస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన పార్టీ నేతల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2029లో మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు. పాత పద్ధతిలోనే వెళ్ళి అధికారం అందుకుందామని చెప్పారు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో తొంబై శాతం క్యాడర్ ప్రసాదరావు మీద అభిమానంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు అని ఆయన చెప్పారు. ఈసారి పార్టీ విజయం తధ్యమని కూడా జోస్యం చెప్పారు. అదే విధంగా ఈ నెల 31వ తేదీన శ్రీకాకుళంలో వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత ఆయన మరింత యాక్టివ్ గా జనంలోకి రానున్నారు అని అంటున్నారు.
సత్తా చూపించాల్సిందే :
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లో సత్తా చూపించాల్సి ఉందని అంటున్నారు. ఈ విషయంలో రామ్ మనోహర్ నాయుడు చూపించే చొరవ ఆయన రాజకీయ వ్యూహాలు ఏమిటి అన్నవి కూడా తెలుస్తాయని అంటున్నారు. వైసీపీకి ఆశాజనకంగా ఎంతో కొంత పరిస్థితి ఉంటే అది రామ్ మనోహర్ కి కలసి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే 2029 లో రామ్ మనోహర్ నాయుడే వైసీపీ తరఫున పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో జిల్లాలో ఈ సీటు లో రాజకీయ పోరు అయితే రంజుగా ఉందనే అంటున్నారు.