నంబర్ ఫైవ్ అట్రాక్షన్ : జనసేన పట్టు ఇక్కడేనా ?

ఇక ఏపీలో మొత్తం ఉన్న పదహారు కార్పొరేషన్లలో అయిదు జనసేన కోరబోతోంది అని అంటున్నారు. ఈ అయిదు కూడా జనసేనకు బలం ఉన్నవి అని గుర్తించారని చెబుతున్నారు.

Update: 2026-08-29 03:54 GMT

జనసేన ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఏ మాత్రం రాజీ పడేది లేదని చెబుతోంది. దానికి కారణం పార్టీకి సైన్యంగా మారి పనిచేస్తున్న క్యాడర్ ని రక్షించుకోవడానికే అని అంటున్నారు. 2014 నుంచి జనసైనికులు ఎలాంటి అధికారం లేకుండా పదవులు లేకుండా పూర్తిగా అభిమానమే పెట్టుబడిగా పెట్టి పనిచేస్తున్నారు. అలాంటి వారికి సముచిత స్థానం గౌరవం పార్టీలో దక్కాలీ అంటే కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్నది జనసేన ఆలోచనగా ఉంది. అందుకే జనసేన విధాయక కమిటీని 14 మందితో వేసి మరీ గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ ని చెక్ చేసుకుంది. తమ బలా బలాలని కూడా తరచి చూసుకుంది. ఇక కీలకమైన సమావేశాన్ని కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసి పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సహా సీనియర్ నేతలు అందరికీ పిలిచి మరీ చర్చించింది.

అన్యాయం జరగదు అంటూ :

జనసేనలో ఉన్న వీర మహిళలు అలాగే పార్టీకి సైన్యంగా ఉన్న వారు ఎవరికీ అన్యాయం జరగదని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. కూటమిలో మిత్ర పక్షంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని అధిగమించి అనుకున్న విధంగా జనసేన రాజకీయ ప్రదర్శన చేయాలని ఆయన బలంగా కోరారు. అదే సమయంలో జనసేన ఎక్కడ పోటీ చేయాలో కూడా పార్టీ తయారు చేసిన నివేదికను అధినేత పవన్ కళ్యాణ్ కి అందిస్తారు. ప్రస్తుతం ప్రకృతి వైద్యం కోసం కేరళంలో ఉన్న పవన్ సెప్టెంబర్ 10 నాటికి ఏపీకి వస్తారు. ఆ తరువాత ఆయన కూటమిలో జనసేన వాటా ఎంత స్థానిక ఎన్నికల్లో జనసేన కోరిన సీట్లు బలాబలాల గురించి పార్టీ నేతలతో మరో మారు చర్చించి చివరిగా చంద్రబాబుతో భేటీ అవుతారు అని అంటున్నారు.

మేయర్ సీట్లు అయిదు :

ఇక ఏపీలో మొత్తం ఉన్న పదహారు కార్పొరేషన్లలో అయిదు జనసేన కోరబోతోంది అని అంటున్నారు. ఈ అయిదు కూడా జనసేనకు బలం ఉన్నవి అని గుర్తించారని చెబుతున్నారు. అవి విజయవాడ,కాకినాడ, తిరుపతి, ఒంగోలు, ఏలూరు అని చెబుతున్నారు. అలాగే జెడ్పీ చైర్మన్లు 28 దాకా ఉన్నాయి. అందులో తొమ్మిది దాకా జనసేనకు ఇవ్వాలని కోరబోతున్నారు. వాటిలో ఉత్తరాంధ్రాలో విజయనగరంతో పాటు గోదావరి జిల్లాలు కోస్తా రాయలసీమ జిల్లాలు ఉన్నాయని తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా జనసేన మూడవ వంతు కోరే చాన్స్ ఉంది. అలాగే ఎంపీపీల విషయంలో జనసేన తమ బలాన్ని బట్టి డిమాండ్ చేయనున్నట్లుగా చెబుతున్నారు.

సాధ్యపడుతుందా :

అయితే జనసేన ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఈ సీట్ల సర్దుబాటు విషయంలో వ్యవహరించనుంది అని అంటున్నారు. కానీ జనసేన కోరిన మేయర్ సీట్లలో విజయవాడ అన్నది టీడీపీ ఇచ్చేది ఉంటుందా అన్నది ఒక చర్చ. ఎందుకంటే అక్కడ టీడీపీకి బలం ఎక్కువ. హార్డ్ కోర్ సీటు అది అని అంటున్నారు. అలాగే ఒంగోలు విషయంలో కూడా టీడీపీ వేరే ఆలోచన చేస్తుందని అంటున్నారు. ఏలూరు విషయంలో కూడా జనసేనను ఒప్పించి టీడీపీ పోటీకి సిద్ధం పడవచ్చు అంటున్నారు. కాకినాడ తిరుపతితో పాటు మరో మేయర్ సీటుని ఇచ్చి మూడు దాకా ఇవ్వాలన్నది టీడీపీ ఆలోచనగా ప్రచారంలో ఉంది. అలాగే జెడ్పీ చైర్మన్లు అయినా మరే పదవులు అయినా సామరస్య ధోరణిలోనే పంచుకోవాలన్నది పెద్దన్నగా టీడీపీ చెబుతున్న మాటగా ఉంది అని అంటున్నారు. అయితే అయిదూళ్ళు అయినా ఇవ్వాలన్నదే జనసేన డిమాండ్ అని అంటున్నారు.

Tags:    

Similar News