ప్రధానిగా మోడీకే చాన్స్...అడ్వాంటేజ్ అక్కడే !

ఇక దేశంలో మోడీ హయాంలో సంక్షేమ పథకాలు మౌలిక వసతులతో చేపట్టిన భారీ మౌలిక సదుపాయాల కల్పనకు కూడా 11 శాతం మంది ఓటేశారు.

Update: 2026-08-29 03:56 GMT

నరేంద్ర మోడీ ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త గా ఉంటూ బీజేపీలో చేరి ఈ రోజుకు నాలుగు దశాబ్దాలు అయింది. అందులో ఆయన పాతికేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ప్రధానిగానే పనిచేశారు. అజేయుడు గా గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రిగా కానీ ప్రధానిగా కానీ ఓటమిని అందుకోలేదు. ఆయన పట్ల గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఎలా అభిమానం చూపించారో అలాగే దేశ ప్రజలు కూడా ఆరాధిస్తున్నారు, దానికి కారణం ఏమిటి అన్నదే పెద్ద చర్చగా ఉంది. మోడీ వర్సెస్ అదర్స్ అంటే ఆయన దరి దాపుల్లోకి కూడా ఎవరూ రాని పరిస్థితి ఉంది. మరే ఇతర ప్రధానికి లేని క్రేజ్ ఇది. నిజానికి పుష్కర కాలంగా మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన గ్రాఫ్ పడిపోవాలి, వేరొకరు ఆ చాన్స్ తీసుకోవాలి. కానీ అదేమీ జరగడం లేదు, సమీపంలో జరుగుతుంది అన్న ఆశ లేదు, ఎందుకంటే మూడ్ ఆఫ్ ది నేషన్ లో వచ్చిన రిజల్ట్ చూస్తే మోడీకి ఇతరులకు మధ్య ఓట్ల శాతంలో భారీ గ్యాప్ కనిపిస్తోంది.

మోడీకే గ్రేట్ అంటూ :

ఈ రోజున దేశంలో ఉన్న పార్టీలలో పెద్ద పార్టీగా బీజేపీ ఉంది. అందులో రెండవ మాటకే చాన్స్ లేదు. అలాగే దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా కూడా బీజేపీ ఉంది. కాంగ్రెస్ అయితే సొంతంగా వంద సీట్లను తెచ్చుకోవడానికి కష్టపడుతోంది. కాంగ్రెస్ లో సీనియర్లు అందరూ వృద్ధులుగా మారిపోయారు. ఇక రాహుల్ గాంధీ మోడీతో పోటీ పడుతున్నారు. అలా మోడీ వర్సెస్ రాహుల్ అని ఎపుడు ఓటింగ్ పెట్టినా మోడీ గెలుస్తున్నారు. ఆయన అందనంత ఎత్తులో ఉంటే సగం ఓట్లతోనే రాహుల్ గాంధీ సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీనికి కారణాలు ఏమిటి అంటే జనాలు అంతా మోడీ వైపు ఉన్నారని కాదు కానీ మోడీ లాంటి మరో నాయకుడు బలమైన ప్రత్యర్ధిగా లేకపోవడమే కీలకమైన కారణం అని అంటున్నారు.

గతంతో పోలిస్తే తగ్గినా :

ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ప్రధానిగా మోడీకి పడిన ఓటింగ్ లో దాదాపుగా ఆరు శాతం తగ్గింది. అయినా కూడా మోడీయే నంబర్ వన్ గా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే - సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ ఆగస్టు 2026 సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 49 శాతం మద్దతుతో దేశంలో తదుపరి ప్రధానమంత్రిగా ప్రజల మొదటి ఎంపిక గా నిలిచారు. ఆయన తర్వాత స్థానంలో రాహుల్ గాంధీ 27.1 శాతం మద్దతుతో చాలా వెనుకబడి ఉన్నారు. ఇక మోదీ ప్రజాదరణలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇదే ఏడాది జనవరిలో 55 శాతం నుండి ఇప్పుడు 49 నమోదైనప్పటికీ, ఆయననే ముందు వరుసలో ఉంచడానికి గల ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. అందులో కీలకమైనవి ప్రస్తావించుకోవాలి.

ప్రపంచ పరిణామాలు సైతం :

ఇక మోడీ బలమైన జాతీయ నాయకుడు అని జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు. ఆయన అధికారంలో ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది అని కూడా నమ్ముతున్నారు. ఈ రోజున ప్రపంచం అంతా యుద్ధం అంచున ఉంది. ఇక భారత్ కి ఇరుగు పొరుగు దేశాలు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. వాటికి గుణపాఠం చెప్పాలంటే రాజీ పడని బలమైన నాయకత్వం అవసరం అని సగటు ప్రజానీకం భావిస్తోంది. అదే మోడీ పట్ల అభిమానం చూపించడానికి కారణం అవుతోంది. దానికి తోడు బీజేపీ జాతీయ భావన అన్నది కూడా గడచిన పన్నెండేళ్ళ కాలంలో దేశంలో బలంగానే వ్యాపించింది. గతంతో పోలిస్తే హిందూ ఓట్ల పోలరైజేషన్ కూడా బాగానే గట్టి పడింది అని అంటున్నారు.

రాజకీయ స్థిరత్వం :

దేశంలో 2014 ముందు వరకూ సంకీర్ణ ప్రభుత్వాలు దేశంలో కనిపించేవి. రాజకీయంగా అనేక పార్టీల సమ్మేళనంతో పాలన సాగింది. కానీ మోడీ వచ్చాక ఒకప్పటి ఇందిరా గాంధీ నెహ్రూ లాంటి బలమైన ప్రధానిగా కనిపించడం కూడా ఒక కారణం. రెండో మాట లేకుండా ఆయన నాయకత్వంలో బలమైన ప్రభుత్వం దేశంలో ఉంది. ఇది సగటు జనాలకు నచ్చుతోంది అని అంటున్నారు. అందుకే దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని మెచ్చుకుంటూ 13 శాతం మంది ఓటేశారు. బలమైన నిర్ణయాత్మక నాయకత్వం మోదీ వల్లనే సాధ్యమని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు.

ఇవి కూడా కారణాలు :

ఇక దేశంలో మోడీ హయాంలో సంక్షేమ పథకాలు మౌలిక వసతులతో చేపట్టిన భారీ మౌలిక సదుపాయాల కల్పనకు కూడా 11 శాతం మంది ఓటేశారు. డిజిటల్ ఇండియా విప్లవం మరియు గ్రామీణ స్థాయి వరకు అందుతున్న వివిధ సంక్షేమ పథకాలు ఆయనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్టమైన ఓటు బ్యాంకును అందించాయని అంటున్నారు. అలాగే సాంస్కృతిక జాతీయ వాదం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి వాటికి 11 శాతం మంది ఆకర్షితులై ఓటేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు దేశంలో హిందుత్వ ఓటర్లను జాతీయవాద భావాలు గలవారిని మోదీ వైపు గట్టిగా నిలబెట్టాయని అంటున్నారు. ఇక అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టని పెంచడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం స్థానాన్ని, గౌరవాన్ని మోదీ పెంచారని 19 శాతం మంది ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

ఆ ఇమేజ్ తోనే :

అంతే కాదు గ్లోబల్ లీడర్‌గా మోడీకి ఉన్న ఇమేజ్ దేశీయంగా ఆయన మైలేజీని పెంచుతోంది. ఇక రాజకీయంగా చెప్పాలంటే మోడీకి ఈ రోజుకి కూడా దేశంలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం అన్నది వాస్తవం. ప్రతిపక్ష కూటమిగా ఇండియా కూటమి ఎంతో కొంత పుంజుకుంటున్నప్పటికీ, జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి దీటైన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతోంది. అందుకే రాహుల్ గాంధీ కంటే మోదీ రేటింగ్ చాలా ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనంగా విశ్లేషణలు ఉన్నాయి. ఇక మోడీకి సవాళ్ళు లేవని కాదు ఆయన హయాంలో దేశంలో పెరుగుతున్న ధరల పెరుగుదల పట్ల నిరుద్యోగం పట్ల జనంలో అసంతృప్తితో ఉన్నప్పటికీ, ప్రధానిగా మోదీపై ఉన్న నమ్మకం మాత్రం కొనసాగడం అంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ బలంగా ఉండడం, బలమైన నేత పోటీగా లేకపోవడం అని అంటున్నారు.

Tags:    

Similar News