ఇప్పటికిప్పుడు ఎన్నికలు...వైసీపీకి దక్కే సీట్లు !
ఒకసారి ఈ సర్వేను పక్కన పెట్టి చూసినా ఏపీలో కూటమి పార్టీలు కలసికట్టుగా ఉన్నాయి. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి.
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు ధీమా పడుతూ ఉంటారు. ఇటీవల ప్రెస్ మీట్ లో అధినేత జగన్ ని మీడియా వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వే గురించి ప్రశ్నిస్తే జనాలలో అదే భావన ఉంది అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఆ సర్వే సంగతి పక్కన పెడితే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో వచ్చిన తాజా సర్వే మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎన్డీయే గెలిచి తీరుతుందని ఆ సర్వే సారాంశం. అంతే కాదు దేశంలో వరసగా నాలుగోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కూడా సర్వే తేల్చేసింది. ఇది ఎన్డీయే ప్రత్యర్ధులకు ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇది ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి అని సర్వే తేటతెల్లం చేస్తోంది.
ఏపీ సంగతేంటంటే :
ఇక ఇదే సర్వేలో ఏపీ సంగతి కూడా ప్రస్తావించింది. ఏపీలో 2024 ఎన్నిల్లో పాతిక ఎంపీ సీట్లకు గానూ ఎన్డీయే పార్టీలు 21 సీట్లను గెలుచుకున్నాయి. వైసీపీ నాలుగు ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. అయితే రెండేళ్ళ తరువాత కూడా ఏపీలో కూటమి బలం ఏ మాత్రం తగ్గలేదని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అంటే చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో కలిసి ఉన్న జనసేన బీజేపీ అంతా ఎన్నికల బరిలోకి దిగితే మరోసారి వారిదే విజయం అని ఈ సర్వే క్లారిటీగా చెబుతోంది. 2024 కంటే ఒక్క ఎంపీ సీటు తక్కువగా 20 సీట్లను ఎన్డీయే ఏపీలో కైవశం చేసుకుంటుంది అని సర్వే అంటోంది. వైసీపీకి అదనంగా లాభించేది ఏంటి అంటే ఒకే ఒక్క సీటు అని అంటోంది. అంటే ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తామని వైసీపీ నేతలు జబ్బలు చరచుకున్నట్లుగా గ్రౌండ్ లో సీన్ లేదని మూడ్ ఆఫ్ ది ఏపీ చెప్పేసింది అని అంటున్నారు.
కూటమితో కష్టమేనా :
ఒకసారి ఈ సర్వేను పక్కన పెట్టి చూసినా ఏపీలో కూటమి పార్టీలు కలసికట్టుగా ఉన్నాయి. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. ఇక చంద్రబాబు రాజకీయ వ్యూహాలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్లామర్ ఆయనతో ఉన్న బలమైన సామాజిక వర్గం బీజేపీకి మోడీ ఇమేజ్ అలాగే కేంద్రం అండదండలు ఇవన్నీ కలసి కూటమి పటిష్టంగానే ఉంది అని ఎవరైనా చెబుతారు. దాంతో వైసీపీ ఒంటరి పోరు కూడా కూటమికి కొత్త బలాన్ని ఇస్తుందని అంటున్నారు. అందుకే ఈ సర్వేని నమ్మాల్సి వస్తోందని కూడా చెబుతున్నారు.
కొంత తగ్గినా కూడా :
ఇక రెండేళ్ళ పాలన తరువాత కూటమి బలం అయితే చెక్కు చెదరలేదని మూడ్ ఆఫ్ ది ఏపీ తెలియచేస్తోంది. దాంతో మరో మూడేళ్ళ తరువాత చూస్తే ఎంతో కొంత ఓటు షేర్ సీట్లు తగ్గితే తగ్గొచ్చు ఏమో కానీ మళ్లీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమని కూడా స్పష్టం చేస్తోంది. మరి వైసీపీ ఏమి చేయాలి అంటే వైసీపీకి ఈ విధమైన రాజకీయ సమీకరణల మధ్య చేసేందుకు కూడా ఏమీ లేదని అంటున్నారు. వైసీపీ ఎంత చేసినా తన బలాన్ని ఒంటరిగానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2014 మాదిరిగా 45 శాతం ఓటు షేర్ ని 2029 ఎన్నికల్లో గెలుచుకున్నా కూడా మూడు పార్టీలు కలసి అంత కంటే ఒకటి రెండు శాతం అధికమే తెచ్చుకుంటాయని అంటున్నారు. ఈ లెక్కన ఏపీలో కూటమికే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కూటమిగా ఉన్నంత కాలం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందే అని విశ్లేషణలు ఉన్నాయి.