ప్రత్యక్షం...వైసీపీకి ప్రాణ సంకటం !

ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపు సులువు అని వైసీపీ అధినాయకత్వం భావిస్తూ ఉండొచ్చు. ఆ మాట ఏకంగా అధినేత జగన్ నోటి నుంచే స్వయంగా వచ్చింది.

Update: 2026-08-28 19:30 GMT

ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపు సులువు అని వైసీపీ అధినాయకత్వం భావిస్తూ ఉండొచ్చు. ఆ మాట ఏకంగా అధినేత జగన్ నోటి నుంచే స్వయంగా వచ్చింది. ఆయన ఇటీవల 174 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిల సమావేశంలో మాట్లాడుతూ డైరెక్ట్ ఎలక్షన్స్ మేలు చేస్తాయన్నట్లుగా మాట్లాడారు. అయితే చంద్రబాబు అన్నీ ఆలోచించే ప్రత్యక్ష ఎన్నికలకు ఓటు వేశారని అంటున్నారు. మేయర్ జెడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల చైర్మన్లు ఇవ్వన్నీ ప్రత్యక్షంగా జరిగే ఎన్నికలుగా టీడీపీ అధినాయకత్వం నిర్ణయించడం వెనక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. నేరుగా జరిగే ఈ ఎన్నికలలో పోటీ పడాలంటే అర్ధబలం అంగబలం తప్పనిసరిగా ఉండి తీరాలి.

భారీ ఎత్తున ఖర్చుగా :

ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధులు బరిలోకి దిగితే కనీసంగా యాభై నుంచి డెబ్బై కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. విశాఖ విజయవాడ లాంటి చోట కార్పోరేటర్ గా పోటీ చేయలాంటేనే వార్డుకు రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు. మరి మేయర్ అభ్యర్ధుల మీదనే ఏ పార్టీ అయినా ఆర్థిక భారం వేస్తుంది. అంటే వారే తమ ఖర్చులను కూడా చూసుకుంటే ప్రతీ వార్డులో తమ పార్టీ అభ్యర్ధులు గెలిచేలా వారికి కూడా దండీగా సాయం అందించాల్సి ఉంటుంది. వారిని గెలిపించుకుంటేనే వారు తమకు ఒక ఓటు వేయించుకుని రెండవ ఓటు మేయర్ అభ్యర్ధికి వేయించగలరు. లేకపోతే తమ ఓటు తాము చూసుకుని వదిలేస్తారు. ఆ భయం ఉండడం వల్లనే మేయర్ అభ్యర్ధిగా ఎవరు ఉన్నా మొత్తానికి మొత్తం ఖర్చు భరించాల్సి ఉంటుందని అంటున్నారు.

వైసీపీకి ఇబ్బందేనా :

ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం అంటే అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థులకి సరిపోతుంది కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి కష్టసాధ్యమని అంటున్నారు. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలుపు గ్యారంటీ అయితే ఉండదు, ఇంకా కూటమి చేతిలో మూడేళ్ల దాకా అధికారం ఉంది, దాంతో కూటమికే ఎక్కువ సంఖ్యలో జై కొట్టే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ కూడా సహజంగానే అధికార కూటమి వైపే అనుకూలంగా ఉంటాయి. ఆ సంగతి తెలిసి కూడా గుండె దిటవు చేసుకుని పార్టీ కోసం విశాల హృదయంతో డబ్బుని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసే వారు వైసీపీకి ఈ సమయంలో ఎవరు దొరుకుతారు అని అంటున్నారు. దాంతోనే ఆదిలోనే వైసీపీ అభ్యర్థుల వేట పెద్ద సమస్య అవుతుందని అంటున్నారు.

ప్రలోభాలు ఖాయం :

ఇక వైసీపీ హయాంలో ప్రత్యర్ధులను పోటీ చేయనీయకుండా ఏకగ్రీవాలు పెద్ద ఎత్తున చేసుకుంది. ఇపుడు అదే సీన్ రిపీట్ చేయడానికి కూటమి సిద్ధంగా ఉంది. ఒక వేళ తెగించి ఎవరైనా వైసీపీ నుంచి పోటీకి దిగినా వారిని నయానో భయానో ఏదో ఒకటి చేసి మరీ పోటీ నుంచి విరమించుకునేలా చేస్తారని అంటున్నారు. అలా చేసినా కూడా గట్టిగా నిలబడాలి అంటే పార్టీ పట్ల ఎంతో ప్రేమ ఉన్న వారు విధేయత ఉన్న వారు అన్నింటికీ మించి విపరీతమైన ధైర్యం ఉన్న వారు కావాల్సి ఉంటుంది. మరి వైసీపీలో అలాంటి వారు ఉంటే వారి వద్ద డబ్బు ఉంటుందా అన్నది ప్రశ్న. ఒక వేళ బిగ్ షాట్స్ ని దించాలనుకుంటే పోటీ కి ముందే కూటమి ప్రలోభాలకు లొంగి చేతులు ఎత్తేస్తే అపుడు గతి ఏమిటి అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైన స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడ వైసీపీకి గెలుపు కంటే కూడా ఉనికి ముఖ్యం. అది నిలబడాలంటే అర్ధబలం అంగబలం ఉన్న దిగ్గజ నేతలు కావాలి. అలాంటి వారి కోసమే వైసీపీ వేటాడే పనిలో ఉంది.

Tags:    

Similar News