స్థానికంపై ష‌ర్మిల ప్ర‌భావం ఎంత‌.. ?

గత 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా వైఎస్ ష‌ర్మిల ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించింది.

Update: 2026-08-28 17:30 GMT

గత 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా వైఎస్ ష‌ర్మిల ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించింది. త‌న పార్టీత‌ర‌ఫున 148 మందిని రంగంలోకి దింపి భారీ పోటీనే ఆమె ఇచ్చారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌ర్య‌టించారు. వాస్త‌వానికి పార్టీ ప‌రంగా బ‌లంగా లేద‌ని తెలిసినా.. వైసీపీని ఓడించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ష‌ర్మిల అప్ప‌ట్లో ప్ర‌చారం చేశారు. త‌మ బాబాయి వివేకా హ‌త్య కేసును, త‌న‌కు జ‌రిగిన కుటుంబ అన్యాయాన్ని కూడా ఆమె ఏక‌రువు పెట్టారు.

ముఖ్యంగా క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన ష‌ర్మిల‌.. ఇక్క‌డ వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి అవినాష్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగారు. ఇక‌, వైసీపీ ఓట‌మి కావాల‌ని కోరుకున్న వివేకా కుమార్తె సునీత కూడా.. క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. పాద‌యాత్ర చేశారు. మొత్తంగా రాష్ట్రంలో వైసీపీని గ‌ద్దె దింపేశారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అంతే స్థాయిలో ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ పుంజుకునేందుకు ప్లాన్ చేస్తోంది. త‌ద్వారా.. గత ఎన్నిక‌ల్లో పోయిన ప్ర‌భావాన్ని ద‌క్కించుకునే ప్లాన్ చేస్తోంది.

ఇది జ‌ర‌గ కూడ‌ద‌ని.. వైసీపీ పుంజుకుంటే ప్ర‌మాద‌మ‌ని కూట‌మి ప్ర‌భుత్వంలోని నాయ‌కులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా ష‌ర్మిల ఎలాంటి అడుగులు వేస్తారు? స్థానికంపై ఆమె ప్ర‌భావం ఎంత? వైసీపీకి ఏమేర‌కు ఆమె గండి కొడ‌తారు? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం గా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ష‌ర్మిల తొలిసారి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిని ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకున్నారు. ఫ‌లితంగా వైసీపీ ప‌రాజ‌యానికి ఆమె కూడా ఒక రీజ‌న్‌గా మిగిలారు.

కానీ.. ఇప్పుడున్న‌ ప‌రిస్థితిలో ష‌ర్మిల ఏమేర‌కు పార్టీ త‌ర‌ఫున పుంజుకుంటార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఆమె ఒక‌వైపే చేస్తున్నార‌న్న వాద‌న సొంత నేత‌ల్లోనే వినిపిస్తోంది. పైగా స్థానికంగా నాయ‌కుల కొర‌త కూడా వెంటాడుతోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై ష‌ర్మిల చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్నారు. వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే దిశ‌గా ఆమెఆలోచ‌న చేస్తున్నార‌ని.. త‌మ ఓటు బ్యాంకును వైసీపీ సొంతం చేసుకుంద‌ని.. ఇప్పుడు దానిని తిరిగి సాధించే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నామ‌ని కేంద్ర మాజీ మంత్రి ప‌ళ్లం రాజు చెప్పుకొచ్చారు. కానీ, ఆమె ఏం చేస్తారు? అనే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. మ‌రి స్థానికంపై ష‌ర్మిల ప్ర‌భావం ఎంత ఉంటుంద‌న్న‌ది మున్ముందు చూడాలి.

Tags:    

Similar News