అగ్రరాజ్యానికి భాగవత్.. భగ్గుమంటున్న అమెరికన్లు!
బీజేపీ సైద్ధాంతిక భావజాలానికి ప్రధాన పునాది అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) చీఫ్(సంఘ్ చాలక్) మోహన్ భాగవత్.. అమెరికా పర్యటనకు రెడీ అయ్యారు.
బీజేపీ సైద్ధాంతిక భావజాలానికి ప్రధాన పునాది అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) చీఫ్(సంఘ్ చాలక్) మోహన్ భాగవత్.. అమెరికా పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన అమెరికాకు బయలు దేరారు. ఆయన నేరుగా న్యూయార్క్ రాష్ట్రానికి వెళ్తారు. న్యూయార్క్‌లో హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మద్దతు దారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ముందస్తు సన్నాహక కార్యక్రమం కూడా ప్రారంభమైంది. భారత కాల మానం ప్రకారం శనివారం భాగవత్ న్యూయార్క్‌లో ప్రసంగించనున్నారు.
అయితే.. భాగవత్ పర్యటన పట్ల.. అమెరికన్లు నిప్పులు చెరుగుతున్నారు. లెక్కకు మిక్కిలి సంఘాలు.. ఆయన రాకను వ్యతిరేకిస్తూ బహిరంగ నిరసనలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, సేవ్ అమెరికా ఫ్రం హిందుత్వ, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, దళిత్ సాలిడారిటీ ఫోరం ప్రతినిధులు ఇప్పటికే భాగవత్ రాకను నిరసిస్తూ.. ప్రకటనలు జారీ చేశారు. భాగవత్ కేవలం హిందూ ప్రతినిధి కాదని.. ఆయన మతాల మధ్య, సమాజం పట్ల చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే వ్యక్తి అని పేర్కొనడం గమనార్హం.
ఈ మేరకు న్యూయార్క్ గవర్నర్ మమ్దానీకి ఆయా సంస్థల ప్రతినిధులు లేఖలు కూడా సమర్పించారు. ఎట్టి పరిస్థితిలోనూ భాగవత్‌ను న్యూయార్క్‌లో అడుగు పెట్టకుండా చూడాలని కోరారు. అదేసమయంలో భాగవత్ పాల్గొనే కార్యక్రమానికి ప్రతిగా తాము కూడా మరో కార్యక్రమం నిర్వహిస్తామని.. దానికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. అయితే.. ఈ వ్యవహారం.. మత విశ్వాసాలకు ముడి పడి ఉండడంతో మమ్దాదాని తీసుకునే నిర్ణయం ఆసక్తిగా మారింది. మరోవైపు.. భాగవత్‌కు అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం దన్నుగా ఉందన్న వార్తలు వస్తున్నాయి.
ఇది సరికాదు: హిందూ అమెరికన్
భాగవత్ వంటి గొప్ప నాయకుడు అమెరికాకు వస్తున్న తరుణంగా ఆయనను వ్యతిరేకించడం సరికాదని హిందూ అమెరికన్ ఫౌండేషన్ సభ్యులు ప్రకటించారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు న్యాయార్క్ ప్రభుత్వం సహకరించాలని కోరారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కార్యకర్తలతో ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని కోరారు. ఏ చిన్న ఘటన జరిగినా.. కార్యక్రమం రద్దయ్యే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు... తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతినివ్వని కేంద్రం మతపరమైన ప్రసంగాలు చేసే భాగవత్‌కు ఎలా అవకాశం ఇచ్చిందని.. పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రశ్నించారు.