ఆగస్టు నెల తెచ్చిన షేర్ల ఒత్తిడి.. ఇన్వెస్టర్లు భయపడాల్సిందేనా?

మార్కెట్ గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో కంపెనీల ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు తమ వాటాలను భారీ ఎత్తున విక్రయించి నగదు రూపంలోకి మార్చుకుంటున్నాయి.

Update: 2026-08-28 10:30 GMT

భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి ఈ నెలలో ఊహించని రీతిలో భారీగా షేర్ల సరఫరా వచ్చిపడింది. మార్కెట్ గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో కంపెనీల ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు తమ వాటాలను భారీ ఎత్తున విక్రయించి నగదు రూపంలోకి మార్చుకుంటున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ ఆఫర్ ఫర్ సేల్ వంటి భారీ ఇష్యూలు తోడవడంతో, కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు రూ. 58,000 కోట్ల విలువైన షేర్ల ప్రవాహం మార్కెట్‌ను ముంచెత్తింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల షాక్ నుంచి నిఫ్టీ 500 సూచీ కోలుకుని వరుసగా మూడో నెల లాభాలను నమోదు చేసినప్పటికీ.. ఈ స్థాయిలో నిరంతరం వస్తున్న షేర్ల విక్రయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆగస్టు 1 నుంచి ఆగస్టు 25 మధ్య కాలంలో నమోదైన విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారులు ఏకంగా రూ. 18,095.72 కోట్ల విలువైన వాటాలను విక్రయించగా, ప్రమోటర్లు రూ. 12,439.77 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్ పరిమాణం రూ. 31,445.84 కోట్లుగా నమోదైంది. అల్ట్రాటెక్ సిమెంట్, కెఫిన్ టెక్నాలజీస్ లాంటి లావాదేవీల్లో ప్రమోటర్, పీఈ నిష్క్రమణలు రెండింటి కింద నమోదైన అతివ్యాప్తిని సర్దుబాటు చేసిన తర్వాత కూడా, నెట్ డీ-డూప్లికేటెడ్ షేర్ల విక్రయాల విలువ రూ. 57,685.08 కోట్లుగా తేలింది. ముఖ్యంగా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ల అమ్మకాల జోరు జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి ఐదు రెట్లు పెరగడం గమనార్హం.

ఈ భారీ పెట్టుబడుల ఉపసంహరణకు ప్రధాన కారణం ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు, లాభాల స్వీకరణ గత కొంతకాలంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ విభాగాలలో స్టాక్స్ మంచి లాభాలను ఆర్జించడంతో, కంపెనీల వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి ప్రమోటర్లు, పీఈ ఫండ్లు ఈ సమయాన్ని ఎంచుకున్నాయి. ఈ పీఈ ఎగ్జిట్స్‌లో మీషో సంస్థలో జరిగిన రూ. 2,918.92 కోట్ల లావాదేవీ అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో అల్ట్రాటెక్ సిమెంట్, లెన్స్‌కార్ట్, పేటీఎమ్, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ నిలిచాయి. కేవలం ఈ ఐదు కంపెనీల వాటాల విక్రయమే మొత్తం పీఈ నిష్క్రమణల్లో దాదాపు 70 శాతంగా ఉంది.

మార్కెట్‌పై ఈ పరిణామాల ప్రభావం గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలోకి క్రమం తప్పకుండా వస్తున్న ఎస్ఐపీ (SIP) నిధులు దేశీయ సంస్థాగత ద్రవ్యతకు బలాన్నిస్తున్నప్పటికీ.. మార్కెట్లోకి ఈ స్థాయిలో నిరంతరం కొత్త షేర్లు వచ్చిపడుతుండటం సెకండరీ మార్కెట్ లిక్విడిటీపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఐపీఓలు, ఓఎఫ్‌ఎస్‌ల ప్రవాహం ఇలాగే కొనసాగిస్తే రిటైల్ ఇన్వెస్టర్ల నిధులు పూర్తిగా ప్రాథమిక మార్కెట్ వైపు మళ్లిపోతాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి రాకపోతే, ఈ భారీ ఇష్యూల నిరంతర రాక సెకండరీ మార్కెట్ నిలకడను దెబ్బతీసే ప్రమాదం ఉందని సామ్‌కో మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మార్కెట్లు గరిష్ట స్థాయిలలో ఉన్నప్పుడు ప్రమోటర్లు, పీఈ ఫండ్లు లాభాలు స్వీకరించి ఎగ్జిట్ అవ్వడం సాధారణ వ్యాపార ప్రక్రియే అయినప్పటికీ.. స్వల్పకాలంలో ఇది సెకండరీ మార్కెట్‌లో షేర్ల సరఫరాను విపరీతంగా పెంచుతుందని అంటున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఆయా స్టాక్స్ వాల్యుయేషన్లు, ఫండమెంటల్స్‌ను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.

Tags:    

Similar News