‘రాఖీ’తో వివాదం ముగిసినట్లేనా ?!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన ఆరోపణలు ఎంత కలకలం రేపాయో అందరికీ తెలిసిందే.

Update: 2026-08-28 08:36 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన ఆరోపణలు ఎంత కలకలం రేపాయో అందరికీ తెలిసిందే. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ, తన కూతురు ప్లాన్ బి ఏంటో తెలీదని కొండా మురళి, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తన టార్గెట్ రేవంత్ రెడ్డి అని కొండా దంపతుల కూతురు సుష్మిత వ్యాఖ్యానించారు.

కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణ సంఘం ఆమెను పదవి నుండి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానానికి సిఫారసు చేసింది. మరోవైపు కొండా సురేఖ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చలు జరిపింది. ఇదే విషయమై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఖర్గేను కలిశారు. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సెప్టెంబరు 2న ఆయన వచ్చిన తరవాత ఈ వివాదానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది.

అయితే అనూహ్యంగా శుక్రవారం రాఖీ పౌర్ణమి సంధర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం అనూహ్య పరిణామాలకు వేదిక అయింది. మంత్రి సీతక్కతో కలిసి మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం విశేషం. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గతంలో వివాదం చెలరేగినప్పుడు కూడా కాంగ్రెస్ పెద్దలు ఇదే నివాసంలో సమావేశమై వివాదం సమసిపోయేలా చేశారు.

అయితే ఇప్పుడు కేవలం ఇద్దరు మహిళా మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన వారిలో ఉన్నారు. ఈ సంధర్భంగా అక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణి గీత కూడా ఉండడం విశేషం. ఇటీవల వివాదం మొదలయ్యాక కొండా సురేఖ అటవీశాఖ మంత్రిగా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అయితే ఆమె పిలుపును ఎవరూ స్వీకరించలేదు. ఒక్క మంత్రి సీతక్క మాత్రమే కొండా సురేఖ పిలుపు మేరకు మొక్కలు నాటడం గమనార్హం.

సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితురాలిగా మంత్రి సీతకక్కకు పేరుంది. వారి మధ్య ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమయింది. కానీ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను సీతక్క ఎక్కడా ఖండించలేదు. కనీసం తప్పు పట్టలేదు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలలో కొండా సురేఖ మినహా మిగతా ప్రజాప్రతినిధుల ఫోటోలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉండగా, కొండా సురేఖ నేరుగా రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ కడుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఈ రాఖీతో వివాదం ముగిసినట్లేనా అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News