జాతీయస్థాయిలో దళపతికి పొలిటికల్ క్రేజ్.. మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో థర్డ్ ప్లేస్!

ఇండియాటుడే-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ ను 9.2 శాతం మంది కోరుకుంటున్నారని వెల్లడైంది.

Update: 2026-08-28 08:36 GMT

తమిళనాట పార్టీని పెట్టిన రెండేళ్లకే సంచలన విజయం సాధించిన దళపతి విజయ్ పేరు జాతీయస్థాయిలో మారుమ్రోగుతోంది. ఇండియాటుడే-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ ను 9.2 శాతం మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇండియా టుడే - సీ ఓటర్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తుంటుంది. ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఈ సారి నిర్వహించిన సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రిగా అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న విజయ్ ప్రధాని అభ్యర్థిగా కూడా దూసుకురావడం విశేషమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు దేశ ప్రజలు ఎక్కువగా మళ్లీ మోడీకే ఓటేశారని సర్వే నివేదిక వెల్లడించింది. ప్రధానిగా మళ్లీ మోదీనే కావాలని సర్వేలో పాల్గొన్న వారిలో 48.7 శాతం మంది కోరుకోవడం విశేషం. ఆయన తర్వాత విపక్ష నేత రాహుల్ గాంధీని 27.1 శాతం మంది ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇక మూడో స్థానంలో 9.2 శాతంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిలిచారు. సీనియర్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (2%), అఖిలేష్ యాదవ్ (1.7%), కేజ్రీవాల్ (1.2%) విజయ్ తర్వాత నిలవడం గమనార్హం. ఇదే సమయంలో సీజీపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను కూడా ప్రధాని అభ్యర్థిగా 1.3% మంది కోరుకుంటున్నారని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడైంది.

కాగా, విపక్ష కూటమికి సారధ్యం వహించే నేతగా కూడా విజయ్ మిగిలిన సీనియర్ నేతలను వెనక్కి నెట్టడం విశేషమని అంటున్నారు. విపక్ష నేతగా రాహుల్ గాంధీకి 29 శాతం మంది మద్దతు ఇస్తే, ఆయన తర్వాత విజయ్ 12 శాతం మంది మద్దతుతో రెండో స్థానంలో నిలిచారు. మమత, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు విజయ్ కంటే వెనుకబడిపోయారు. తాజా సర్వే ఫలితాలతో జాతీయ రాజకీయాల్లో విజయ్ క్రేజ్ రానురాను పెరుగుతోందని భావిస్తున్నారు. సినీ నటుడిగా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్న దళపతి.. రాజకీయాల్లో కూడా అదే హవా కొనసాగిస్తున్నారని అంటున్నారు.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే ఈ సర్వేలో ఈ సారి సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 326 సీట్లతో మళ్లీ ఎన్డీఏ గెలుస్తుందని సర్వేలో తేల్చారు. బీజేపీ సొంతంగా 261 సీట్లు తెచ్చుకుంటుందని స్పష్టమైంది. అయితే ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వే ఫలితాలు కన్నా ఎన్డీఏ తక్కువ స్థానాలకు పరిమితం అవుతుందని తాజా సర్వే ఫలితాలు చెబుతున్నాయని అంటున్నారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమి 352 సీట్లు, బీజేపీ 287 సీట్లు వస్తాయని వెల్లడైంది. అయితే ఉద్యోగాల కొరత, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కేంద్ర ప్రభుత్వంపై యువతలో అసంతృప్తి వంటి కారణాలతో ఎన్డీఏ ప్రభుత్వ గ్రాఫ్ కొద్దిగా తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వే ఫలితాలు కేంద్ర పెద్దలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News