జగన్ కి ఉన్న నమ్మకం నేతలకు లేదా ?

వైసీపీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. దశాబ్దాల తరబడి మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు.

Update: 2026-08-28 06:30 GMT

వైసీపీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. దశాబ్దాల తరబడి మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. రాజకీయంగా చూస్తే ఢక్కామెక్కీలు తిన్న నాయకులు కూడా కనిపిస్తారు. వీరంతా కాంగ్రెస్ అనే ఒక పురాతన రాజకీయ సంస్థలో చేరి నిష్ణాతులు అయి వచ్చిన వారు. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఏపీ విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ మటు మాయం కావడంతో వారంతా మరో దారి లేక వైసీపీలో చేరారు. అయితే ఆ సమయంలో వైఎస్సార్ ప్రమాదవశాత్తు మరణించడంతో ఏర్పడిన సానుభూతి, జగన్ యంగ్ అండ్ డైనమిక్ గా జనంలో కొత్త నాయకత్వంతో కనిపించడం ఇవన్నీ కూడా అనుకూల పవనాలుగా మారి 2014లో వైసీపీని బలమైన పార్టీగా నిలబెట్టాయి. అయితే అధికారం దగ్గర దాకా వచ్చి మరీ వైసీపీ ఓటమి పాలు అయింది. ఇక్కడే అందరికీ ఒక సందేహం వస్తుంది. ఆనాడు వైసీపీ నుంచి నాయకులు ఎందుకు బయటకు వెళ్ళలేదు అని. అంతే కాదు వారికి వైసీపీ పట్ల ఎందుకు అంత నమ్మకం ఉందని. ఈ ప్రశ్నలకు జవాబులు కూడా ఉన్నాయి.

ఒక్క చాన్స్ ఇద్దామని :

ఓడినా జగన్ లో ఫైర్ అలాగే ఉంది. ఆయన కొత్త అయినా అసెంబ్లీకి వెళ్లారు, ప్రతిపక్ష నాయకుడిగా మూడేళ్ల పాటు విభజన ఏపీలో సమర్ధంగా పనిచేశారు. ఆ తరువాత జనంలోకి వెళ్ళి భారీ పాదయాత్ర చేపట్టారు. దానికి అనూహ్యమైన మద్దతు లభించింది. ఇక ఆనాడు కొంత మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు అంతా అలాగే ఉన్నారు. ప్రజలలో కూడా వైఎస్సార్ వారసుడికి ఒక్క చాన్స్ ఇవ్వాలన్న బలమైన ఆకాంక్ష ఉందని వైసీపీలో ఉన్న సీనియర్లు గ్రహించడం వల్లనే ఆ పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారు. వారి ఆశలు ధీమాలు కూడా ఫలించాయి. జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అయిదేళ్ల జగన్ పాలనలో మంచి పనులు జరగలేదని ఎవరూ అనరు కానీ అంతకు మించి ప్రజా వ్యతిరేక చర్యలు కూడా జరిగాయి. దానికి జగన్ అనుభవ రాహిత్యంతో పాటు ఎవరి మాటా వినకపోవడం అన్నది కూడా సీనియర్లు గ్రహించారు అని చెబుతారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ అధికారంలో ఉండడం చూశారు, విపక్షంలో ఉండడం చూశారు, ఇపుడు 2024 నుంచి కూడా చూస్తున్నారు. దాంతోనే సీనియర్ల మార్క్ విశ్లేషణలు ఉన్నాయని అంటున్నారు.

గతానికి భిన్నంగా :

ఏపీ రాజకీయం కూడా గతానికి భిన్నంగా ఉంది. జనసేన మెల్లగా బలమైన పార్టీగా మారుతోంది. పుబ్బలో పుట్టి మఖలో మాడే పార్టీ కాదు అని అర్థం అవుతోంది. పైగా ఏపీలో అత్యంత జనాభా శాతం కలిగిన బలమైన సామాజిక వర్గం ఈ రోజుకీ జనసేనతోనే ఉందని కూడా గ్రహిస్తున్నారు. చంద్రబాబును జగన్ ని చూసేసిన జనాలు చాన్స్ ఇస్తే పవన్ కి ఇస్తారు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అలాగే బలమైన సామాజిక వర్గంలో తమ నుంచి సీఎం గా ఒకరు కావాలని ఉంది. ఇవన్నీ కూడా వైసీపీని మరోసారి అధికారంలోకి రానీయకుండా చేసే సెంటిమెంట్ అస్త్రాలుగానే వైసీపీలో సీనియర్లు చాలా మంది చూస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు టీడీపీలో కూడా యువ నేతగా బలమైన సారధిగా లోకేష్ అవతరించారు. లోకేష్ ప్రత్యర్ధులు అనుకున్నట్లుగా పప్పు కాదని నిప్పు అని నిరూపించుకున్నారు. టీడీపీకి లోకేష్ రూపంలో బలమైన అండ ఉంది. దాంతో టీడీపీని మరో నలభై ఏళ్ళ పాటు నడిపే దృఢమైన నాయకత్వం లభించింది అని అంటున్నారు. లోకేష్ ని కూడా సీఎం గా చూడాలని జనంలోనూ ఉంది, టీడీపీలో ఉంది. మరో బలమైన సామాజిక వర్గంలోనూ ఉంది. ఇలా చూస్తే ఏపీలో ఇపుడు ఫ్రెష్ లీడర్లు ఎవరూ అంటే పవన్ లోకేష్ కనిపిస్తున్నారు అని అంటున్నారు.

రెండు రెళ్ళు నాలుగు కాదు :

ఈ నేపథ్యంలో ఇంతటి పోటీ వాతావరణంలో వైసీపీ బలీయమైన పార్టీగా పోరాటాలు చేయాల్సి ఉండగా కూటమి వ్యతిరేకత తమకు అధికారాన్ని కట్టబెడుతుందని ఈ రోజుకీ భావిస్తూ ఉండడమే వైసీపీలో సైతం తలపండిన రాజకీయ నేతలను ఆలోచనల్లో పడేస్తోంది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ వ్యూహాలు లేకుండా గాలిలో మేడలు కడుతోందని కూడా భావిస్తున్నారు. అసెంబ్లీకి వైసీపీ వెళ్ళకపోవడం ఒక భారీ తప్పిదంగా వైసీపీలో కూడా అనుకుంటున్నారని చెబుతున్నారు. అలాగే రెండేళ్ళకు పైగా కాలం గడచినా అధినాయకుడు జనంతో కానీ క్యాడర్ తో కానీ నేరుగా కనెక్ట్ కాకపోవడం కూడా అంతా చర్చించుకునే పరిస్థితి ఉంది. వైసీపీకి దూరం అయిన వర్గాలను దగ్గరకు తీసే ప్రయత్నం చేయకపోవడం పార్టీని వీడిన వారిని కలుపుకుని పోయే చర్యలు చేపట్టకపోవడం కూడా సీనియర్లు గమనిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద వచ్చేది మనమే అని జగన్ ఎంత నిబ్బరంగా చెబుతున్నా సీనియర్లు అయితే అంతలా నమ్మడం లేదని అంటున్నారు. అందుకే బిగ్ షాట్స్ సైతం తమ దారి తాము చూసుకునేందుకు ఆలోచిస్తున్నారా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.

Tags:    

Similar News