అమరావతిని వెతుక్కుంటూ వచ్చిన ప్రతిష్టాత్మక సంస్థ

ఏపీకి కేరాఫ్ అమరావతి అన్నది తెలిసిందే. ఎందుకంటే రాజధాని ప్రాంతం అది.

Update: 2026-08-28 03:57 GMT

ఏపీకి కేరాఫ్ అమరావతి అన్నది తెలిసిందే. ఎందుకంటే రాజధాని ప్రాంతం అది. ఏప్రిల్ 1వ తేదీన పార్లమెంట్ లో కూడా ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతిని పేర్కొంటూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదించారు. ఇక అంతకు ముందు నుంచే అమరావతి దేశమంతా నానుతోంది. ఆ తర్వాత నుంచి అమరావతి మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేంద్రం సైతం ఏ ప్రాజెక్ట్ అయినా అమరావతికే కేటాయిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమరావతిలో కీలక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలోనే ఉండాలని భావిస్తూ మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థ రావడం గొప్ప విశేషంగా చెబుతున్నారు.

తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్శిటీ :

అమరావతి రాజధానిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేతృత్వంలో 730 కోట్ల రూపాయలతో దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ ట్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. వచ్చే నెల 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎల్టీటీ తరగతులు ప్రారంభం అవుతాయని అంటున్నారు. ఇప్పటికే 8.5 ఎకరాలను నైలిట్ ఎల్టీటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కేటాయిస్తూ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికత ఆధునిక పరిశోధనలు ఆవిష్కరణలకు కేంద్రీకృతమైన జాతీయ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చారిత్రాత్మక మైలు రాయిగా భావిస్తున్నారు.

అమరావతికే చాన్స్ :

ఇక కేంద్రం కూడా అమరావతికే చాన్స్ ఇస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- డీమ్డ్ టూ బీ యూనివర్శిటీ ఏర్పాటు వెనక కేంద్రం చొరవ ఉంది.730.70 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం 100 శాతం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఫండ్ గా సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఇతర అధునాతన డీప్-టెక్ రంగాలలో విద్యా బోధన, ఉపాధి శిక్షణ, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తీసుకురానున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయమైన నైలిట్ పంజాబ్‌లోని రోపర్‌లో ప్రధాన క్యాంపస్ తో సాగుతోంది. దేశవ్యాప్తంగా 56 కేంద్రాలు, 11 రాజ్యాంగ విభాగాలు, 700కు పైగా గుర్తింపు పొందిన సంస్థల నెట్‌వర్క్‌తో పనిచేస్తున్న నైలిట్ అమరావతి వేదికగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తన డీప్ టెక్ క్యాంపస్‌ను విస్తరిస్తోంది.

త్వరలోనే క్లాసులు :

అమరావతిలో శాశ్వత ప్రాంగణ నిర్మాణం పూర్తయ్యేంతవరకు ఆగకుండా సెప్టెంబర్ నెల నుంచే విద్యార్థులు, వృత్తి నిపుణులకు కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వసతిలో విద్యా బోధన, అధునాతన సాంకేతిక శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. ఈ క్యాంపస్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైన్, వీఎల్స్ ఎస్ ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్ పీసీ వంటి కీలక రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ, డిప్లొమా, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల కాలంలో మొత్తం 8,250 మంది లబ్ధి పొందనుండగా, అందులో 1,650 మంది డిగ్రీ-పీజీ కోర్సుల ద్వారా, 6,600 మంది విద్యార్థులు నైపుణ్య సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా శిక్షణ పొందుతారని చెబుతున్నారు.

Tags:    

Similar News