వాట్సాప్ ఫార్వర్డ్ ఇప్పుడు రాజకీయ ప్రచారంలో అత్యంత పవర్ ఫుల్ టూల్ గా మారిందా?

ఒకప్పుడు నాయకులు మైకులు బద్దలయ్యేలా అరిచి.. చేతులు ఊపి.. చెమటలు తుడ్చుకుంటూ ఓట్లు అడిగేవారు.

Update: 2026-08-28 02:46 GMT

ఒకప్పుడు నాయకులు మైకులు బద్దలయ్యేలా అరిచి.. చేతులు ఊపి.. చెమటలు తుడ్చుకుంటూ ఓట్లు అడిగేవారు. పాపం ఇప్పుడు ఆ కష్టమంతా దేనికి? మీ ఇంట్లో ప్రశాంతంగా ఛాయ్ తాగుతుంటే మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్ డింగ్‌మని మోగితే చాలు.. అక్కడొక రాజకీయ విప్లవం పూర్తి అయిపోతోంది. అవును.. నేటి రాజకీయాల్లో డ్రామా వేదికల మీద కాదు.. మన ‘ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్’లలో జరుగుతోంది.

నమ్మకం మాది.. నెట్ డేటా మీది..

టీవీలో ప్రకటన వస్తే "ఛే.. ఇదంతా పెయిడ్ ప్రచారం" అని స్కిప్ కొట్టేస్తాం. కానీ అదే వార్తను మన బాబాయో మామయ్యో ఫార్వర్డ్ చేస్తే? "పాపం, పెద్దాయన పంపాడు.. ఇందులో ఏదో నిజం ఉండే ఉంటుంది" అని మన అమాయకపు మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడే అసలైన మేజిక్ ఉంది. పార్టీలు రూపాయి ఖర్చు లేకుండా మన బాబాయ్‌లనే తమ ఉచిత బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చేసాయి. ప్రకటనలు పాతబడిపోయాయి.. మన ‘రిలేటివ్స్ నమ్మకమే’ ఇప్పుడు మార్కెట్‌లో హాట్ కేక్.

ఓ వ్యక్తి.. వంద రూపాంతరాలు

పబ్లిక్ మీటింగ్‌లో నాయకుడు మాట్లాడితే అందరికీ ఒకే స్పీచ్. కానీ వాట్సాప్‌లో అలా కాదు.. యంగ్‌స్టర్స్‌కి ఒక కటింగ్, రైతులకు ఒక సెంటిమెంట్.. ఐటీ ఉద్యోగులకు మరో కలరింగ్. ఊరికో భాష, వీధికో మాండలికంతో కంటెంట్ సిద్ధమైపోతుంది. మెసేజ్ మొదట ‘కోర్ టీమ్’ నుంచి బయలుదేరి.. గల్లీ నాయకుల దాకా వచ్చి, చివరికి మీ ఫోన్ స్క్రీన్ మీద ల్యాండ్ అవుతుంది. మైక్రో టార్గెటింగ్ అంటే ఇదే మరి!

మూలాలు వెతకకండి.. దొరకవు!

ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు? అని రీసెర్చ్ చేయడం కంటే వర్షంలో కాఫీ తాగడం బెటర్. ఎందుకంటే ఫార్వర్డ్ లిమిట్స్ పెట్టినా మనోళ్లు కాపీ-పేస్ట్ టెక్నాలజీలో పిహెచ్‌డీ చేశారు. మూలాలు దొరకవు, పట్టుకోవడం సాధ్యం కాదు. డిజిటల్ మాయాజాలం అంటే ఇదే..

ఏఐ ప్లస్ బాబాయ్ = మైండ్ బ్లాక్

దీనికి తోడు ఇప్పుడు డీప్‌ఫేక్స్, ఏఐ వీడియోలు తోడయ్యాయి. నాయకుడు అనని మాటలను అన్నట్లు.. వెళ్లని చోటికి వెళ్లినట్లు క్రియేట్ చేయడం చిటికెలో పని. ఫ్యాక్ట్ చెక్ టీమ్ అది అబద్ధం అని చెప్పేలోపే మన గ్రూపుల్లో ఆ వీడియో వందసార్లు రౌండ్లు కొట్టేసి జనాలు దాన్ని నిజమని నమ్మేసి విశ్లేషణలు కూడా మొదలెట్టేస్తారు.

రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం కానీ ఎవరి వాట్సాప్ అడ్మిన్ స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్లదే రాజ్యంగా మారినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఓటు వేసేముందు కాస్త మెదడుకి పనిచెప్పండి.. లేదంటే మీ ఫోన్‌లోని ఫార్వర్డ్ మెసేజే మీ ఓటును డిసైడ్ చేసేస్తుంది.

రాజకీయ ప్రచారం ఇక కేవలం సభలు, పోస్టర్లు, టీవీ ప్రకటనల మధ్య పోటీ కాదు. ప్రజల ఫోన్‌లో కనిపించే ప్రతి మెసేజ్, వీడియో, ఆడియో, ఫొటో కూడా ఒక రాజకీయ నారేటివ్ ను నిర్మించగలుగుతోంది.

వాట్సాప్ ఫార్వర్డ్ ఎన్నికల ఫలితాన్ని ఒంటరిగా నిర్ణయించకపోవచ్చు. కానీ ప్రజలు ఏ అంశం గురించి మాట్లాడాలి.. ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఏ నారేటివ్‌ను నిజమని భావించాలి అనే దానిపై ప్రభావం చూపే శక్తి మాత్రం దానికి ఉంది. భవిష్యత్ రాజకీయాల్లో అసలు పోటీ సభల మధ్య మాత్రమే కాదు.. ప్రజల మొబైల్ స్క్రీన్‌పై కనిపించే ప్రతి మెసేజ్ చుట్టూ కూడా ఉండొచ్చు.

Tags:    

Similar News