స్థానిక ఎన్నికలను వైసీపీ ఆపుతుందా.. ?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార కూటమి ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార కూటమి ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బయటకు ‘ఎన్నికలకు మేం సిద్ధం’ అని ప్రకటిస్తున్న ప్రతిపక్ష వైసపీ, తెరవెనుక మాత్రం ఎన్నికలను ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కుతోందా ? అన్న సందేహాలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాలేదని, పాత జాబితాతో ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. అయితే, ఈ సాంకేతిక అభ్యంతరాలలో ఎలాంటి బలం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిసారీ సవరణ ప్రక్రియ పేరిట ఎన్నికలు ఆపాలనే నిబంధన ఎక్కడా లేదు. గతంలో అమల్లో ఉన్న అర్హత తేదీ ఆధారిత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించడం సబబే అంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా నిర్ణీత సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల స్థానిక సంస్థల గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత క్షేత్రస్థాయిలో తీవ్ర నాయకత్వ లోటును ఎదుర్కొంటున్న వైసీపీ, మరోసారి ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆందోళనతోనే ఈ ఎన్నికలను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తోందా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాలను, కేంద్ర నిధులను పణంగా పెట్టి కోర్టు కేసుల పేరుతో అభివృద్ధికి ఆటంకం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే న్యాయపరంగా, సాంకేతికంగా బలహీనమైన ఈ సాకులతో స్థానిక సమరాన్ని వైసీపీ ఆపగలుగుతుందా ? అన్నది చూడాలి.
గత 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. ఈ క్రమంలోనే పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల్లో ఒక్కచోట ఏకగ్రీవం జరిగినా వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని తేల్చిచెప్పేశారు. ఓ వైపు జగన్ పార్టీ ఇన్‌చార్జ్‌లను ఒత్తిడి చేస్తున్నా.. ఇటు ఎన్నికలు ఆలస్యం అయ్యేలా కావాలనే చేస్తుందా ? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఆలస్యం అయ్యేకొద్ది కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో పాటు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.