విశాఖ మేయర్ రేసు.. టీడీపీకి తలనొప్పి తప్పదా?

రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

Update: 2026-08-28 11:30 GMT

రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. టీడీపీకి కంచుకోటలాంటి విశాఖ నగరానికి మేయర్ గా ఎవరిని ఎంపిక చేయనున్నారనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతోపాటు గ్రేటర్ విశాఖగా విస్తరించిన మరో మూడు నియోజకవర్గాలు కలిపి జీవీఎంసీ పరిధిలో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయడమే ఇప్పుడు పెద్ద సవాల్ గా భావిస్తున్నారు. దీంతో విశాఖ మేయర్ చాన్స్ లభించే లక్కీ లీడర్ ఎవరన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

విశాఖ మేయర్ గా ప్రస్తుతం పీలా శ్రీనివాసరావు కొనసాగుతున్న ఏడాది క్రితమే ఈయన మేయర్ గా ఎన్నికయ్యారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సోదరుడు అయిన శ్రీనివాసరావు మరోమారు మేయర్ అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తుండటంతో పీలా శ్రీనివాసరావుకు మళ్లీ అవకాశం ఇచ్చే విషయంలో పార్టీలో తర్జనభర్జన జరుగుతోందని అంటున్నారు. ఇదే సమయంలో పలువురు యువనేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విశాఖలోని నాలుగు నియోజకవర్గాలతోపాటు గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి పదవులు ఆశించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆ అవకాశం లభించక నిరాశకు గురయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు తమ కుటుంబ సభ్యులకు మేయర్ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారని అంటున్నారు.

విశాఖ నగరం పరిధిలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, పెందుర్తి నియోజకవర్గమే అయినప్పటికీ ప్రస్తుతం మాడుగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి చివరి క్షణంలో త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, భీమిలి మాజీ ఇంచార్జి కోరాడ రాజాబాబు వంటివారు మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరికొందరు సైతం ఎంపీ భరత్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో జనసేన కోటాలో మేయర్ పదవి దక్కించుకోవాలని ఆ పార్టీ తరఫున కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని చెబుతున్నారు.

ఇలా విశాఖ నగరంపై పలువురు నేతలు దృష్టి పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష పద్ధతిలో మేయరును ఎన్నుకోవాల్సివున్నందున ప్రజలకు బాగా తెలిసిన నేతలు, సమర్థులను ఎంపిక చేయాలని టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నగరానికి అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని సమర్థంగా పనిచేసే వారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్వేషిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఎవరూ ఊహించని అభ్యర్థి మేయర్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆశావహులు ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.

Tags:    

Similar News