బీజేపీకి దూరం అవుతున్న విశాఖ ?
ఆనాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ ని ఎదిరించి మరీ విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు.
విశాఖ అంటేనే బీజేపీ అన్నట్లుగా ఒకప్పుడు పరిస్థితి ఉండేది. గట్టిగా చెప్పాలీ అంటే తెలంగాణాలో బీజేపీ ఇంకా బలపడని రోజులలో ఆ మాటకు వస్తే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి గేట్ వేగా సింహద్వారం తెరచినది విశాఖలోనే. 1981లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ అప్పటిదకా మున్సిపాలిటీగా ఉండేది ఒక్కసారిగా కార్పొరేషన్ గా పదోన్నతి పొందింది. ఆ విధంగా తొలి కార్పోరేషన్ అయిన విశాఖలో జెండా ఎగరేసింది బీజేపీ. ఆనాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ ని ఎదిరించి మరీ విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు.
వాజ్ పేయి స్వయంగా వచ్చి :
కానీ ఈ ఫీట్ ని ఎంతో సమర్ధంగా సాధించి బీజేపీ తొలి మేయర్ పదవిని అందుకుంది. అప్పట్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి ప్రత్యేకంగా విశాఖలో మకాం వేసి మరీ ఎన్నికల వ్యూహాలు రచించి బీజేపీని గెలిపించారు అంటే ఆశ్చర్యంతో పాటు ఆసక్తి కూడా కలుగుతుంది. ఒక కార్పోరేషన్ కోసం జాతీయ ప్రెసిడెంట్ రావడం అంటే మామూలు విషయం కానే కాదు అని అంటారు. కానీ బీజేపీ మాత్రం దక్షిణాదిన పాగా వేయాలనుకుంది. దానికి విశాఖనే రాజ మార్గంగా ఎంచుకుంది. అలా బీజేపీ విశాఖలో వికసించింది కానీ ఏపీలో గడచిన యాభై ఏళ్ళుగా ఎన్నడూ అధికారానికి దరి దాపుల్లో కాదు కానీ పట్టు పని పది ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది.
ఆ పునాదుల మీదనే :
అయితే వాజ్ పేయి ఆనాడు విశాఖలో బీజేపీ ఎదుగుదలకు వేసిన బలమైన పునాదుల మీదనే ఆ పార్టీ ఈ రోజు దాకా అలా నిలబడి ఉంది అన్నది వాస్తవం. బీజేపీ ఈ క్రమంలో తరువాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో విడిగానూ పొత్తులలోనూ కొన్ని డివిజన్లు గెలుచుకుంటూ తన సత్తా చాటుతూ వస్తోంది. పొత్తులు లేకపోయినా 2021లో ఒక కార్పోరేటర్ ఆ పార్టీ నుంచి గెలిచారు అంటే ఎంతో కొంత బలం ఉన్నట్లుగానే లెక్క. ఇక ఎమ్మెల్యే ఎంపీ పదవులు కూడా ఇక్కడ నుంచి బీజేపీ దక్కించుకుంది. విశాఖలో బీజేపీ బలపడడానికి కారణం మధ్యతరగతి వర్గాలు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మినీ ఇండియాగా విశాఖ ఉండడం, ఇతర రాష్ట్రాలకు చెందిన జనాలు ఎక్కువగా ఉండడం వారికి బీజేపీ జాతీయ పార్టీగా బాగా అభిమానం ఉండడంతోనే సాధ్యపడింది.
తొలిసారి అలా :
ఇదిలా ఉంటే ఎపుడు పొత్తు ఉన్నా విశాఖ ఎంపీ సీటు బీజేపీ పట్టు బట్టి మరీ సాధించేది. అలాగే ఒకసారి గెలుచుకుంది కూడా. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం విశాఖ సీటు బీజేపీ కోరినా టీడీపీ ఇవ్వలేదు. దానికి బదులుగా అనకాపల్లిని కేటాయించింది. దాంతో బీజేపీలో కొంత నిరాశ ఏర్పడింది. విశాఖ నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వారికి కూడా ఇది ఆశాభంగంగా మారింది. ఇక ఇపుడు బీజేపీ మరోసారి విశాఖ మీద తన పట్టుని నిరూపించుకోవాలని చూస్తోంది. దాని కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తూ వస్తోంది.
మేయర్ సీటు కోసం :
పొత్తులలో భాగంగా మేయర్ సీటుని తమకు కేటాయించాలని బీజేపీ కోరుతోంది అని అంటున్నారు. తొలి మేయర్ గా గెలిచిన ట్రాక్ రికార్డుని కూడ బీజేపీ ఈ సందర్భంగా చెబుతోంది. దాంతో పాటు విశాఖలో తమ పట్టు జారకుండా ఉండాలంటే మేయర్ పీఠం తమ ఆధీనంలో ఉండాలని కోరుకుంటోంది. అయితే టీడీపీ విశాఖ మేయర్ సీటుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని అంటున్నారు. ఏపీలోనే అతి పెద్ద కార్పోరేషన్ ని ఎలా వదులుకుంటారు అని కూడా చర్చ సాగుతోంది. పైగా విశాఖ చుట్టూ అభివృద్ధి అంతా సాగుతున్న వేళ టీడీపీ నుంచి మేయర్ సీటు బీజేపీకి వెళ్లడానికి నో చాన్స్ అని అంటున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విశాఖ వాసి కావడంతో పాటు ఎంపీ సీటు ఎటూ ఇవ్వలేదు కాబట్టి మేయర్ ఇవ్వాలని బీజేపీ నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.