తెలంగాణలో డీలిమిటేషన్ తో ఎవరికెంత లాభం ?

2029లో జమిలి ఎన్నికలకు వెళ్తారని మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికి నష్టం ? ఎవరికి లాభం ? అన్న చర్చ మొదలయింది.

Update: 2026-08-29 17:30 GMT

తెలంగాణలో డీలిమిటేషన్ జరిగితే ఎవరికి లాభం చేకూరుతుంది ? ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ లలో సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? డీలిమిటేషన్ ఇప్పట్లో సాధ్యం కాదు. 2034లో ఉండవచ్చు అని ఒక చర్చ నడుస్తుంది. కానీ 2028 లోపు డీలిమిటేషన్ పూర్తి చేసి, 2029లో జమిలి ఎన్నికలకు వెళ్తారని మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికి నష్టం ? ఎవరికి లాభం ? అన్న చర్చ మొదలయింది.

డీ లిమిటేషన్ మూలంగా ప్రస్తుతం 119 ఉన్న శాసనసభ స్థానాలు 179 నుండి 182 వరకు, 17 ఉన్న పార్లమెంటు స్థానాలు 26 వరకు పెరుగుతాయని అంటున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు కోసం లోక్ సభ స్థానాలు పెంచే ప్రక్రియతో ఇది ముడిపడి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అంచనాల ప్రకారం 153 నుండి 175 వరకు ఉండవచ్చని అంటున్నారు. తాజా అంచనాలు మాత్రం 182 వరకు ఉండవచ్చని అంటున్నారు.

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు అన్ని అంచనా స్థాయిలోనే ఉన్నాయి. జనగణన, రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ కమీషన్ తర్వాతనే ఖచ్చితమైన సంఖ్యలు నిర్ణయించబడతాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా ఆదారిత పద్దతి ద్వారా నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నాయి. దీని మూలంగా బలమైన ప్రాంతాలు చీలిపోవడం మూలంగా పోటీ పెరిగే అవకాశం ఉంది. సరిహద్దుల నిర్ణయం, రిజర్వేషన్ల కేటాయింపు అధారంగా ఎవరికి ఎంత లాభం అనేది తేలుతుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కొత్త స్థానాలను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రధానంగా దక్షిణ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 117 శాసనసభ, 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు.

అర్భన్, సబర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుంది. కొత్త నియోజకవర్గాలు, చిన్న నియోజకవర్గాల మూలంగా మార్జిన్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో కొంత లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తుంది.

సాంప్రదాయ గ్రామీణ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్వల్ప తేడాతో ఓటములు చవిచూసినా ఈ సారి ఓటర్లు తమ వైపే మొగ్గు చూపుతారని బలంగా నమ్ముతుంది. ఇక హైదరాబాద్ నగరంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకుంది. అయితే సరిహద్దులు మారితే పార్టీకి ఉన్న బలమైన నెట్ వర్క్ చీలిపోతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బలంగా ఉండే ఎంఐఎం పార్టీ ఆ లోక్ సభ స్థానం మూడుగా చీలిపోతే ముస్లిం ఓట్లు చెదిరిపోతాయని భావిస్తుంది. ఇది ఎంఐఎంకు నష్టం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కొత్తగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఏర్పడితే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు లాభం చేకూరుతుందని, ప్రాంతీయ పార్టీలకు సవాళ్లు ఎక్కువవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు, పట్టణ ప్రాంతాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చని అంచనాలున్నాయి.

Tags:    

Similar News