ఏపీ కార్పొరేషన్లలో కూటమి లెక్కలు ఎలా? జనసేన, బీజేపీ మేయర్ స్థానాలు ఎన్ని?
కేబినెట్ హోదా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నిస్తుండగా, పొత్తులు ఆయా నేతలను టెన్షన్ కు గురిచేస్తున్నాయని చెబుతున్నారు.
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ సారి ఎక్కువ చోట్ల పోటీ చేస్తామని, బలం ఉన్న ప్రతిచోట తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారంటూ జనసేన నేతలు చేస్తున్న ప్రకటనలతో పొత్తు రాజకీయం హీటెక్కుతోంది. ముఖ్యంగా నగరపాలక సంస్థల పరిధిలో పొత్తులు ఎలా ఉంటాయనేది ఎక్కువ ఆసక్తి రేపుతోంది. కేబినెట్ హోదా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నిస్తుండగా, పొత్తులు ఆయా నేతలను టెన్షన్ కు గురిచేస్తున్నాయని చెబుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీలు ఉండగా, 17 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో ఏ పార్టీ ఎన్నిచోట్ల పోటీ చేస్తుంది? కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది? జనసేనకు ఏయే నగరాలు కేటాయిస్తుంది? బీజేపీకి మేయర్ పదవి ఇస్తారా? ఇవ్వరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పొత్తు చర్చలతో సంబంధం లేకుండా మచిలీపట్నం వంటి చోట్ల జనసేన నేతలు మేయర్ పదవుల కోసం బహిరంగంగా వాదులాటకు దిగుతుండటంతో పొత్తు రాజకీయాలు కాకరేపుతున్నాయని చెబుతున్నారు.
గత ఎన్నికల సమయంలో తాము పోటీ చేసిన స్థానాలను ఇప్పుడు తమకు వదిలేయాలని జనసేన కోరుతోంది. అయితే అప్పట్లో పొత్తు లేకపోవడం ఒక కారణమైతే, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండటం వల్ల మేయర్ స్థానాల విషయంలో ఉత్కంఠ సాగుతోందని అంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి వంటి మున్సిపల్ కార్పొరేషన్లను జనసేన కోరుకుంటుందనే ప్రచారం హీటెక్కిస్తోంది. పొత్తులపై కూటమి పార్టీలు ఇప్పటివరకు సమావేశం అవ్వకపోగా, ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారమే ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.
కూటమి పార్టీలకు చెందిన అధిష్టానాలు పొత్తులపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని సూచిస్తున్నాయి. కానీ, పదవుల ఆశతో ఉన్న నేతలు తమ ఆత్రుతను అనుచుకోలేక పొత్తులపై అంచనాలు వేస్తూ వేడిపుట్టిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ప్రాంతాలు, పట్టణాల వారీగా మూడు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే విషయమై ఊహాగానాలకు తెరతీస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా జనసేనకు కేటాయించే స్థానాలపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనుండటంతో పొత్తుల్లో మూడు పార్టీలు బలాబలాలు ఆధారంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బలంతో సంబంధం లేకుండా విశాఖపట్నం మేయర్ పదవిని తమకు వదిలేయాలని బీజేపీ కోరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంతో టీడీపీ ఆశావహులు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. అదే సమయంలో గోదావరి పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జనసేన ఆశిస్తోందని అంటున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు ఆశించిన టీడీపీ నేతలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి పొత్తులపై కూటమి లెక్కలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు.