రికార్డు స్థాయికి భారత్ ఫారెక్స్ నిల్వలు.. సాధారణ ప్రజలకు దీని వల్ల ఏం ప్రయోజనం?
విదేశీ మారక నిల్వలు అనేవి అత్యవసర పరిస్థితుల్లో దేశం ఉపయోగించే ఆర్థిక బఫర్ లాంటివి.
భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త చరిత్రను తిరగరాసింది. దేశ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో భారీగా పెరిగి.. ఆగస్టు 2026 నాటికి 729.33 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ హై మార్కును తాకాయి. నివేదికల ప్రకారం కేవలం ఒక్క వారంలోనే నిల్వలు ఏకంగా 12.42 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇందులో ఫారిన్ కరెన్సీ అసెట్స్ 591.33 బిలియన్ డాలర్లకు.. గోల్డ్ రిజర్వ్స్ 114.22 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశ ఖజానాలో ఇన్ని బిలియన్ డాలర్లు వచ్చి చేరడం అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక బలాన్ని చాటిచెబుతోంది. అయితే ఒక సామాన్య పౌరుడికి దీనివల్ల నేరుగా లాభం చేకూరుతుందా.. రోజువారీ బడ్జెట్ పై లేదా పెట్రోల్ ధరలపై ఇది ఏమైనా ప్రభావం చూపుతుందా అనే సందేహాలు రావడం సహజం. నిజానికి ఈ నిల్వల వల్ల మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావు.. కానీ దేశ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచే ఒక బలమైన పరోక్ష రక్షణ కవచంగా ఇది పనిచేస్తుంది.
విదేశీ మారక నిల్వలు అనేవి అత్యవసర పరిస్థితుల్లో దేశం ఉపయోగించే ఆర్థిక బఫర్ లాంటివి. భారతదేశం తన చమురు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక యంత్రాల వంటి అత్యవసర దిగుమతులకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన వద్ద ఉన్న 729 బిలియన్ డాలర్ల నిల్వలు దేశానికి దాదాపు 11 నెలలకు పైగా దిగుమతులను ఎలాంటి అంతరాయం లేకుండా కవర్ చేయగలవు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధ భయాలు ఏర్పడి రూపాయి విలువ తీవ్రంగా పడిపోయే ప్రమాదం వచ్చినప్పుడు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఈ డాలర్లను మార్కెట్లో విక్రయించడం ద్వారా రూపాయిపై వచ్చే తీవ్రమైన ఒత్తిడిని తగ్గిస్తుంది.
రూపాయి స్థిరంగా ఉంటే దేశానికి దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్, ఇంధనం, ముడిసరుకుల ధరలు అదుపులో ఉంటాయి. దీనివల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగకుండా పరోక్ష నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాకుండా భారీ విదేశీ నిల్వలు ఉన్న దేశాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారులు సురక్షితమైనదిగా భావిస్తారు. ఇది దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడానికి తద్వారా కొత్త పరిశ్రమలు రాకకు దోహదపడుతుంది.
మరి సామాన్యుడికి ఏం లాభం?
ఇక్కడే అసలు విషయం ఉంది. ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ప్రభుత్వం ప్రతి కుటుంబానికి డబ్బు పంచదు. మీ బ్యాంక్ ఖాతాలో ఒక్క రూపాయి కూడా అదనంగా పడదు. కానీ దాని పరోక్ష ప్రభావం ఉంటుంది. రూపాయి తీవ్రంగా పడిపోకుండా ఆర్బీఐకి ఎక్కువ సామర్థ్యం ఉంటే దిగుమతి ఖర్చులపై ఒత్తిడి కొంత తగ్గవచ్చు. ముఖ్యంగా చమురు ధరలు, ఇంధన ధరలు, విదేశీ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై రూపాయి పతనం వల్ల వచ్చే అదనపు భారాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దిగుమతి ఖర్చులు అదుపులో ఉంటే, దాని ప్రభావం ద్రవ్యోల్బణంపైనా కొంత సానుకూలంగా ఉండొచ్చు. అదే విధంగా విదేశీ పెట్టుబడిదారులకు పెద్ద ఫారెక్స్ నిల్వలు అంటే.. దేశానికి తక్షణ విదేశీ చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం ఉంది అనే సానుకూల సంకేతం. ఇది దేశం అంతర్గత స్థిరత్వంపై నమ్మకాన్ని పెంచే అంశాల్లో ఒకటి.
ఫారెక్స్ నిల్వలు ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావు
ఇది అత్యంత ముఖ్యమైన విషయం. పెద్ద ఫారెక్స్ నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే ఒక ముఖ్యమైన సూచిక మాత్రమే. కానీ ఇది నిరుద్యోగం, పేదరికం, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం లేదా తక్కువ వేతనాలను నేరుగా పరిష్కరించదు. దేశం దగ్గర $729 బిలియన్ల నిల్వలు ఉన్నా, యువతకు సరైన ఉద్యోగాలు రాకపోతే ఆ ప్రయోజనం వారి జీవితాల్లో నేరుగా కనిపించదు. కూరగాయలు, ఇళ్లు, విద్య, వైద్యం వంటి దేశీయ ఖర్చులు పెరుగుతుంటే కూడా ఫారెక్స్ నిల్వలు ఒక్కటే పరిష్కారం కాదు.
అందుకే అసలు ఆర్థిక విజయాన్ని కేవలం “దేశం దగ్గర ఎన్ని డాలర్లు ఉన్నాయా?” అనే ప్రశ్నతో కొలవలేం. దానికి తోడు ఉత్పత్తి, ఉద్యోగాలు, ఆదాయాలు, పెట్టుబడులు, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు ఎలా మారుతున్నాయో చూడాలి.
అయితే ఈ రికార్డు స్థాయి పెరుగుదల వెనుక మరొక కోణం కూడా ఉంది. ఈ తాజా పెరుగుదలలో ఎన్ఆర్ఐ డిపాజిట్లు, ఆర్‌బిఐ ప్రవేశపెట్టిన ప్రత్యేక పాలసీల ద్వారా వచ్చిన విదేశీ నిల్వలే ప్రధాన పాత్ర పోషించాయి. జూన్ నుంచి ఆగస్టు మధ్య నమోదైన 73 బిలియన్ డాలర్ల ప్రవాహాల్లో దాదాపు 65 బిలియన్ డాలర్లు ఎన్ఆర్ఐ డిపాజిట్ల నుంచే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ నిల్వల పెరుగుదల అనేది పూర్తిగా స్వదేశీ ఉత్పత్తి లేదా ఎగుమతులు పెరగడం వల్ల వచ్చింది కాదు కాబట్టి ఇది భవిష్యత్తులో ఎంతవరకు నిలకడగా ఉంటుందనేది గమనించాల్సిన విషయం.
చివరిగా దేశ ఖజానాలో డాలర్లు నిండినంత మాత్రాన నిరుద్యోగం, పేదరికం, దినదినాభివృద్ధి చెందుతున్న జీవన వ్యయం వంటి సమస్యలు నేరుగా పరిష్కారం కావు. నిత్యం పెరిగే ఇళ్ల ఖర్చులు, విద్య, వైద్య వ్యయాల మధ్య నలిగిపోయే సాధారణ కుటుంబానికి ఈ గణాంకాలు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వలేవు. భవిష్యత్తులో స్థిరమైన రూపాయి.. తగ్గేవంటి దిగుమతి ఖర్చులు, పెరిగే ఉపాధి అవకాశాలు.. అదుపులో ఉండే ధరల రూపంలో ఈ ఫోరెక్స్ నిల్వల ప్రభావం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌లో కనిపించినప్పుడే ఈ రికార్డుకు సంపూర్ణమైన అర్థం చేకూరుతుంది.