అలిగి వెళ్లిపోయిన హైద‌రాబాద్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే... !

ప్రభుత్వ అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే హెచ్చరించడం సర్వసాధారణం.

Update: 2026-08-29 18:09 GMT

ప్రభుత్వ అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే హెచ్చరించడం సర్వసాధారణం. ఈ కోణంలోనే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేంద‌ర్ త‌ర్వాత కాంగ్రెస్ చెంత చేరారు. గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న సికింద్రాబాద్ పార్ల‌మెంటు సీటునుంచి కాంగ్రెస్ ఎంపీ క్యాండెట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్‌లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ర‌గ‌లిపోతున్నారు. తాజాగా శ‌నివారం ఖైర‌తాబాద్ డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌కు సంబంధించిన ప్ర‌క్రియ చేప‌ట్టారు. స్వ‌యంగా ఎమ్మెల్యేగా ఉన్న దానం ఆధ్వ‌ర్యంలో ల‌క్కీ డ్రా వేయాల్సి ఉండ‌గా.. అధికారులు ఆయ‌న లేకుండానే ల‌క్కీ డ్రా వేసేసి ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసేశారు.

ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు అక్క‌డ నుంచి అలిగి వెళ్లిపోయారు. అధికారులు ఆయ‌న‌ను స‌ర్దిచెప్పుతూ ఆపేందుకు ప్ర‌య‌త్నించినా విన‌లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించడం వల్ల ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా చేరడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

దానం త‌న కోపం అంతా అధికారుల మీద చూపించినా.. అస‌లు క‌థ ఆయ‌న‌కు ప్ర‌భుత్వంలో ఎలాంటి ప్ర‌యార్టీ లేద‌ని.. ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రితో పాటు మంత్రులు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే అన్న గుస‌గుస‌లు హైద‌రాబాద్‌, తెలంగాణ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News