మాదకద్రవ్యాలను ప్రసాదంగా చూపిస్తూ రీల్స్? తర్వాత ఏ జరిగిందంటే?
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య;
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం! భక్తి, ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలిచే రోజు శివరాత్రి. కొన్ని క్షణాల లైకులు, వ్యూస్ కోసం మలిన ప్రదర్శనలకు వేదిక కావడం ఎంత దురదృష్టకరం! సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం కోల్పోతే సమాజం ఎటు వైపునకు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించాలి.
కఠిన శిక్షలు ఉంటాయి..
మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు.. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాలి. మత్తు పదార్థాల ప్రదర్శన, వినియోగం, ప్రచారం.. ఏ రూపంలో అయినా కఠినంగా తీసుకోవాల్సిందే. కేసు నమోదైతే అది కేవలం పోలీస్ స్టేషన్ వరకే ఆగదు.. కోర్టు, శిక్ష, క్రిమినల్ రికార్డ్.. జీవితాంతం వెంటాడే ముద్రగా మిగులుతుంది.
ఇలాంటి వీడియోలతో జీవితంపై మరక
లైకుల కోసం లోకాన్నే మరిచి.. వ్యూస్ కోసం.. విలువలనే వదిలి.. రీల్స్ కోసం రోడ్డున పడి.. మత్తులో మునిగి.. జీవితాలను నాశనం చేసుకుంటారా!? క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ‘వైరల్’ కావడం ఒక మత్తుగా మారింది. కానీ ఆ మత్తు తాత్కాలికం. రేపు అదే వీడియో మీ కుటుంబానికి, మీ భవిష్యత్తు అవకాశాలకు, మీ గౌరవానికి మచ్చగా మారితే? ఉద్యోగ దరఖాస్తుల్లో, విదేశీ వీసా ప్రక్రియల్లో, ఉన్నత విద్యలో డిజిటల్ ఫుట్‌ప్రింట్ పరిశీలన సాధారణం అయిపోయింది. ఒక అవివేకి రీల్ కారణంగా ఎన్నో ద్వారాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది.
చర్యలు తీసుకుంటారా?
ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు వాదిస్తున్నారు. భక్తి పేరుతో, దేవుడి పేరు మీద మత్తు పదార్థాలను ప్రోత్సహించడం సమాజానికి ప్రమాదకరం. ఇది కేవలం వ్యక్తిగత తప్పు కాదు.. యువతపై చెడు ప్రభావం చూపే సామాజిక నేరం. ఇలాంటి చర్యలు చూసి మరికొందరు అనుకరించే అవకాశం ఉంది. అందుకే చట్టం కఠినంగా వ్యవహరించాల్సిందే.
ఈ నిర్లక్షమే కోర్టులో సాక్షంగా మారుతుంది..
మరో కోణంలో చూస్తే.. ఇది మనలో పెరుగుతున్న డిజిటల్ నిర్లక్ష్యానికి సంకేతం. రీల్ తీశాక వచ్చే కామెంట్లు, షేర్లు, ఫాలోవర్లు ఇవి తాత్కాలిక ఉత్సాహం మాత్రమే. కానీ ఒకసారి పోలీస్ కేసు నమోదైతే, అదే సోషల్ మీడియా మీపై తీర్పు చెప్పే వేదికగా మారుతుంది. ‘సరదాగా చేశాం’ అన్న వాదన చట్టం ముందు నిలబడదు. సమాజం ముందు గౌరవం తిరిగి సంపాదించడం అంత సులభం కాదు.
యువత ఒక్కసారి ఆలోచించాలి.. మహాశివరాత్రి వంటి ఆధ్యాత్మిక వేడుకలు మనలోని చెడును జయించి మంచిని ఆహ్వానించమని చెబుతాయి. అలాంటి పవిత్ర దినాన్ని మత్తు ప్రదర్శనగా మార్చడం ఆ తత్త్వానికి విరుద్ధం. ధైర్యం అంటే తప్పు చేసి వైరల్ కావడం కాదు.. సరైనదాన్ని ఎంచుకోవడం. నిజమైన గుర్తింపు విలువలతో వస్తుంది, వికృతాలతో కాదు.
సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి.. వ్యసనాలకు వాకిలిగా కాదు. మీ ప్రతిభను, కళను, ఆలోచనలను ప్రదర్శించండి. సమాజానికి సానుకూల సందేశాలు ఇవ్వండి. క్షణిక ఫేమ్ కోసం జీవితాన్ని పణంగా పెట్టడం మూర్ఖత్వం. బాధ్యతతో, సంస్కారంతో, చట్టపరమైన అవగాహనతో సోషల్ మీడియాను వినియోగిస్తేనే అది ఆశీర్వాదం అవుతుంది.. లేకపోతే అదే శాపంగా మారుతుంది.