వరదల్లో చిక్కుకున్న 1200 మంది.. మరణించిన వారి సంఖ్య ఎంతంటే..?
కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.;
కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జమ్మూ-కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చషోటి గ్రామ సమీపంలో వరదల కారణంగా గురువారం భారీ ప్రాణనష్టం సంభవించిందని జాతీయ మీడియా తెలిపింది. మధ్యాహ్నం సమయంలో మచైల్ మాతాయాత్ర మార్గంలో సంభవించిన భారీ వరదలతో 37 మంది వరకు మరణించారు. వారిలో ఎక్కువ మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తుంది. 100 మందికి పైగా గాయపడ్డారని ఆ రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. అనేక మంది గల్లంతవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మచైల్ మాతా ట్రెక్కింగ్ చేస్తున్న యాత్రికులేనని జమ్మూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఎస్ టుటి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మచైల్ మాతా భక్తుల ట్రెకింగ్ ప్రదేశాన్ని తాకిన వరద..
9,500 అడుగుల ఎత్తైన మచైల్ మాతా ఆలయానికి వెళ్లే మార్గంలో చివరి ప్రదేశం అయిన చోసిటిని భారీ వరద తాకింది. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంటల మధ్య వందలాది మంది గుమిగూడారు. ఆలయానికి చేరుకునే చివరి 8.5 కిలో మీటర్ల ట్రెక్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికీ సహాయక బృందాలు 65 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు, భారీ వర్షాలు, వరదలో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ‘లంగర్’ ఆకస్మిక వరదలకు గురైంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ ఈ ఘటనపై స్పందించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతుందని, లంగర్, సమీప ప్రాంతంలో 1000 నుంచి 1200 మంది ఉన్నట్లు చెప్తున్నారు. వారంతా వరదల్లో చిక్కుకున్నారని మృతదేహాలు వెలికి తీస్తున్నామని, 96 మందికి భారీగా గాయాలయ్యాయని, వీరిలో 36 మంది పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందన్నారు. జమ్మూ-కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితి గురించి వివరించామని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని మీడియాకు చెప్పారు.
దేశంలో ఇతర ప్రదేశాలలో భారీ వరద..
దేశంలో భారీ వర్షపాతం నమోదవుతోంది, ఉత్తరాఖండ్‌లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంతకుముందు, ఉత్తరకాశిలో విధ్వంసం సృష్టించిన కొన్ని రోజుల కొండచరియలు విరిగిపడి చమోలి జిల్లాలోని నందప్రయాగ్‌లో రోడ్లు మూసుకుపోయాయి.