విజయవాడకు లులు మాల్.. ఎక్కడంటే?
ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లోని విజయవాడ నగర ఇమేజ్ ను అంతకంతకూ పెంచేందుకు వీలుగా కూటమి సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.;
ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లోని విజయవాడ నగర ఇమేజ్ ను అంతకంతకూ పెంచేందుకు వీలుగా కూటమి సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలోని విశాఖలో లూలు మాల్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం.. అందుకు తగ్గట్లే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడకు కూడా లూలు రానున్న అంశంపై స్పష్టత వచ్చింది. విజయవాడలో ఏర్పాటు చేసే లూలు మాల్ కు అవసరమైన భూమి కేటాయింపుపై ప్రభుత్వం పరిశీలన చేయటంతో పాటు.. ప్లేస్ ను తాజాగా డిసైడ్ చేశారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడ బస్టాండ్ (పండిట్ నెహ్రూ బస్టాండ్)కు సమీపంలో పోలీస్ కంట్రోల్ రూం జంక్షన్ వద్ద గవర్నర్ పేరట 2 ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కు కేటాయించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. విశాఖ.. విజయవాడలో ఏర్పాటు చేసే లూలు మాల్ కోసం సదరు సంస్థ రూ.1222 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 1500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆర్టీసీ డిపో భూమిని తమకు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖపై ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీకి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రావటంతో.. ఆ దిశగా అడుగులు పడాల్సి ఉంది. లూలు మాల్ ఏర్పాటు చేద్దామనుకుంటున్న గవర్నర్ పేట 2 డిపో మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ భూమిని లూలు మాల్ కు ఇచ్చేస్తే.. ఆర్టీకి గొల్లపూడి సమీపంలోని ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇప్పుడు లూలు మాల్ కు కేటాయించాలని డిసైడ్ చేసిన స్థలం.. ఒకప్పుడు విజయవాడ బస్టాండ్ గా ఉండేది. 1990లో ఇప్పటి బస్టాండ్ ను ఏర్పాటు చేసిన క్రమంలో దానిని అక్కడకు తరలించారు. ఇప్పుడు మరోసారి ఆ భూమిని లూలు మాల్ కు కేటాయించటంతో.. ఈ భూమి ఆర్టీసీ నుంచి శాశ్వితంగా దూరం కానుంది. సుదీర్ఘ అనుబంధానికి తెర పడనుందని చెప్పాలి.