పీఓకే విషయంలో భారత్ కు బ్రిటీష్ ఎంపీ ఆసక్తికర సూచన!
పహల్గాం ఉగ్రదాడి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;
పహల్గాం ఉగ్రదాడి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్, యూకే, ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్ మొదలైన దేశాల నుంచి భారత్ కు మద్దతు లభించిన పరిస్థితి. ఈ సమయంలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా పహాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ వ్యవహారంపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి సూచించారు. ఇందులో భాగంగా... కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు.
ఇదే సమయంలో.. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండటానికి.. ఈ సారి భారత్ ఇచ్చే జవాబు కఠినంగా ఉండాలని మేఘనాథ్ కోరారు! ఈ నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగమే అని మేఘనాథ్ నొక్కి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి చాలా క్రూరమైనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో... భారత్ – పాక్ మధ్య నెలకొన్న కశ్మీర్ వివాదంలో పహల్గాం ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తం చేసిన మేఘనాథ్... ఈ విషయంలో మోడీ నేతృత్వంలోని భారత సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.